సమ్మెలోనే ఇందారం ఓపెన్ కాస్ట్ వోల్వో డ్రైవర్లు

సమ్మెలోనే ఇందారం ఓపెన్ కాస్ట్ వోల్వో డ్రైవర్లు

జైపూర్/కోల్ బెల్ట్​,వెలుగు:  మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియా ఇందారం-–1 సింగరేణి ఓపెన్​కాస్ట్​గనిలో  కాంట్రాక్ట్​ వోల్వో డ్రైవర్ల సమ్మె శుక్రవారం కూడా కొనసాగింది. వారం రోజులుగా  సమ్మె చేస్తుండగా గనిలో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనులు  పూర్తిగా నిలిచిపోయాయి.  గత నెల 29న ఇందారం ఓసీపీలో ఓబీ పనులు నిర్వహించే  వరాహీ ఓబీ కాంట్రాక్ట్​ కంపెనీ మూడు షిప్టులకు చెందిన సుమారు 300 మంది వోల్వో డ్రైవర్లు తమ వేతనాలు పెంచాలని సమ్మెకు దిగారు. 

ఏండ్లుగా వేతనాల పెంపుపై సింగరేణి, ఓసీపీ ఓబీ కాంట్రాక్ట్​ కంపెనీ పట్టించుకోవడంలేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రూ.19,370 లు ఇస్తున్నారని, దానిని రూ.22,800 పెంచాలని డిమాండ్​చేస్తున్నారు. వోల్వో డ్రైవర్ల సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, కాంట్రాక్ట్​ సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. వారం రోజుల సమ్మెతో సింగరేణి కంపెనీ సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. .