సింగరేణిలో మెరిట్ స్కాలర్​షిప్ రూ.10 వేల నుంచి 16 వేలకు పెంపు

సింగరేణిలో మెరిట్ స్కాలర్​షిప్  రూ.10 వేల నుంచి 16 వేలకు పెంపు
  • ఉత్తర్వులు జారీ చేసిన సంస్థ

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇస్తున్న వార్షిక స్కాలర్​షిప్ మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికుల పిల్లలు ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఈ స్కాలర్​షిప్ ను అందిస్తోంది. గతంలో  కనీస ర్యాంకు 2000 లోపు ఉన్న ఉద్యోగుల పిల్లలకు  ఇచ్చే స్కాలర్​షిప్​ను 8000 లోపు ర్యాంకు వరకు పెంచినట్టు సింగరేణి తెలిపింది. 

కార్మికుల పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించడానికి 1998లో ఈ స్కాలర్​షిప్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇటీవల గుర్తింపు కార్మిక సంఘంతో జరిగిన సమావేశంలో స్కాలర్​షిప్ మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలని, స్కాలర్​షిప్ వర్తింపును కూడా 2000 ర్యాంకు లోపు నుంచి 8000 ర్యాంకు లోపు వరకు పెంచాలని గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.  దీనికి సంస్థ సీఎండీ  ఎన్. బలరామ్ సానుకూలంగా స్పందించారు. సీఎండీ ఆదేశం మేరకు  సవరించిన స్కాలర్​షిప్​కు సంబంధించిన సర్క్యులర్  ను డైరెక్టర్ జారీ చేశారు. తాజా  ఉత్తర్వులు 2024–-25 అకాడమిక్ ఇయర్​లో హాజరైన విద్యార్థిని విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు. ఈ మేరకు అన్ని ఏరియాల నుంచి జూన్ 15 లోపు దరఖాస్తులు పంపించాలని వెల్లడించారు.