
- ఏటా వానాకాలం మురికి నీళ్లు సప్లయ్
- ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై యాజమాన్యం నిర్లక్ష్యం
కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు : సింగరేణి కార్మికవాడలకు కలుషిత నీరు సప్లై అవుతోంది. కార్మికుల సంక్షేమం కోసం పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నామని చెప్తున్న సింగరేణి యాజమాన్యం తాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో మంచిర్యాల జిల్లాలోని పట్టణాలకు తరచూ రంగు మారిన మురికి నీళ్లు సప్లై అవుతున్నాయి. నస్పూర్ మండలం సీతారాంపల్లి ఇన్‌టెక్ వెల్‌వద్ద గోదావరి నదిలో ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల నుంచి నీళ్లు తీసుకొని ఫిల్టర్బెడ్వద్ద శుద్ధి చేసి శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి కార్మిక కాలనీకు నిత్యం 8 మిలియన్గ్యాలన్లకు పైగా సప్లై చేస్తోంది. అయితే, తరచూ వాసనతో కూడిన రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. నీటిని శుద్ధి చేసే సరఫరా చేస్తున్నామని యాజమాన్యం చెప్తున్నప్పటికీ రంగుమారిన నీళ్లే వస్తున్నాయి. దీంతో వాటిని కార్మిక కుటుంబాలు తాగేందుకు భయపడుతున్నాయి. కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం కేవలం తాత్కాలిక చర్యలకే పరిమితమైంది.
కార్మిక కుటుంబాల ఆందోళనలు
బెల్లంపల్లి పట్టణంలోని గోల్‌బంగ్లా, పోస్ట్ఆఫీస్ ఏరియాల్లో పైపులైన్లు మురికి కాల్వల్లో ఉండటంతో లీకేజీల వల్ల పలు ప్రాంతాల్లో కలుషిత నీరు సప్లై అవుతోంది. గోదావరి నది నుంచి సేకరించిన నీటిని సింగరేణి గతంలో సీతారాంపల్లిలోని ఫిల్టర్ బెడ్లో శుద్ధి చేసి కార్మికవాడలకు సప్లై చేసేది. ప్రస్తుతం ఆ ఫిల్టర్ బెడ్‌ను వినియోగించడంలేదు. దీంతో ఆ ప్రాంతంలో మురికి నీళ్లు వస్తున్నాయని అక్కడి కార్మికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా రంగు మారిన నీళ్లు సప్లై అవుతున్నా సింగరేణి యాజమాన్యం నివారణ చర్యలు తీసుకోవడంలేదని, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడంలేదని కార్మిక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమకు కలుషిత నీరు సప్లై అవుతోందని శ్రీరాంపూర్ఏరియా షిర్కే సెంటర్లో కొద్దిరోజుల క్రితం ఆందోళనకు దిగాయి. తమకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఎంఎస్ లీడర్లు శ్రీరాంపూర్ జీఎంకు వినతిపత్రం సైతం అందజేశారు.
కొన్ని చోట్ల మాత్రమే ఆర్వో ప్లాంట్లు
బొగ్గు గనుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సింగరేణి యాజమాన్యం.. నివాస ప్రాంతాలను మాత్రం పట్టించుకోవడంలేదు. కొన్ని ప్రాంతాల్లోనే ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంది. గతేడాది నీరు కలుషితం కావడంతో యాజమాన్యం హడవిడిగా శ్రీరాంపూర్ఏరియాలో 10 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ రెండింటిని మాత్రమే ఏర్పాటు చేసింది. మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, సోమగూడెం వంటి సింగరేణి కార్మిక ప్రాంతాల్లో కూడా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. యాజమాన్యం పట్టించుకోవడంలేదు. దీంతో కార్మిక కుటుంబాలు తప్పని పరిస్థితుల్లో మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి ప్రాంతాల్లో ప్రతి రోజూ రూ.10 లక్షల నీటి వ్యాపారం జరుగుతోంది.
కార్మిక వాడలకు మంచినీళ్లియ్యాలె
బురద నీళ్లు తాగలేక బయట కొనుక్కుంటున్నాం. కార్మికుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని సింగరేణి యాజమాన్యం చెప్తున్నా గుక్కెడు స్వచ్ఛమైన నీటిని సప్లై చేయడంలో విఫలమైంది. ఏటా వానాకాలంలో బురద, మురికి నీళ్లు సరఫరా అవుతున్నాయి. కార్మికవాడల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి మంచినీళ్లు అందించాలె.
- పంచెర్పుల నరేశ్, బీఎంఎస్లీడర్
ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లకు ప్రతిపాదనలు పంపాం
సింగరేణి కార్మిక వాడలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఏర్పాటుకు రూ.16.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ఫండ్స్ కేటాయించగానే యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతాం.
- శ్రీరాంపూర్ సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి