- నిరుడు కంటే రూ.వెయ్యి కోట్లకు పైగా స్థూల లాభం
- స్ఫూర్తినిచ్చిన అవగాహన సదస్సులు
- అత్యధిక లాభాల వాటా, దీపావళి బోనస్ తో కార్మికుల్లో నూతనోత్సాహం
హైదరాబాద్, వెలుగు: వర్షాలతో ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో ఉత్పత్తికి అవాంతరాలు ఏర్పడ్డప్పటికీ.. వాటిని అధిగమించి గత ఏడు నెలల్లో నిరుటితో పోల్చితే సింగరేణి వెయ్యి కోట్లకు పైగా లాభాల సాధించింది. సీఎండీ బలరాం ఉత్పత్తిపై ప్రత్యేకంగా సమీక్షించి, రోజువారీగా దిశానిర్దేశం చేస్తూ టార్గెట్ సాధించేలా సమాయత్తం చేశారు. ఫలితంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ ఇయర్లీలో గణనీయమైన వృద్ధి సాధించింది.
ఇదే ఊపులో వార్షిక ఉత్పత్తి టార్గెట్ 720 లక్షల టన్నులను అందుకోవాలని సింగరేణి యంత్రాంగం సిద్ధమైంది. ఈయేడు బొగ్గు అమ్మకం ద్వారా రూ.17,151 కోట్లు, విద్యుత్తు అమ్మకాల ద్వారా రూ.2,286 కోట్ల టర్నోవర్ సాధించింది. గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బొగ్గు, థర్మల్ విద్యుత్ అమ్మకాల ద్వారా పన్ను చెల్లింపునకు ముందు రూ.4 వేల కోట్ల స్థూల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. గతేడాది ఇదే టైమ్‌లో ఆర్జించిన రూ.2,932 కోట్ల కంటే ఇది రూ.1072 కోట్లు ఎక్కువ కావడం విశేషం. గతేడాదితో పోల్చితే స్థూల లాభంపై 36 శాతం వృద్ధి సాధించింది.
ఉత్సాహం నింపిన సర్కారు ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాల వాటా రూ.796 కోట్లను ఈ సారి ప్రకటించింది. దీపావళి బోనస్ రూ.358 కోట్లు, కార్మికుల రక్షణకు రూ.కోటి ప్రమాద బీమా కల్పించి వారిలో ధైర్యం పెంచింది. అలాగే కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ, ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీలకు అటవీ అనుమతులు రావడంతో సంస్థ భవిష్యత్ కు భరోసా కలిగింది.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని గనుల రక్షణ కమిటీలు, పిట్ కమిటీలు, వర్క్ ఇన్స్పెక్టర్లలతో బలరామ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఒకేసారి 40 గనులకు చెందిన 1,500 మంది సూపర్వైజరీ సిబ్బందితో మాట్లాడి ఉత్పత్తి కన్నా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సీఎండీ స్వయంగా ఏరియాల్లోని గనులను తనిఖీ చేస్తూ సంక్షేమంపై దృష్టిసారించారు. ఈ అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రెండు ఉద్యోగ నోటిఫికేషన్లతో 599 మంది కొత్త ఉద్యోగులను ఈ నెలలో నియమించబోతున్నారు.
వాస్తవాలు వివరిస్తూ కార్మికుల్లో అవగాహన..
అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ‘‘ఉజ్వల సింగరేణి-–ఉద్యోగుల పాత్ర’’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తి, కార్మికుల బాధ్యతపై ప్రత్యేక సమావేశాలు, సామూహిక విందు నిర్వహించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, యంత్రాల వినియోగాన్ని పెంచడంపై అవగాహన కలిగించారు. యంత్రాల వినియోగాన్ని 14 గంటల నుంచి 20 గంటల వరకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
మణుగూరు, రామగుండం-1, ఇల్లందు, కొత్తగూడెం, ఆర్జీ-3, తదితర ఏరియాల్లో ప్రొడక్షన్ డే నిర్వహిస్తూ యంత్రాల వినియోగాన్ని 20 గంటల వరకు పెంచగలిగారు. వర్షాకాలంలో రోజుకు లక్ష టన్నులకు పడిపోయిన ఉత్పత్తి ఇప్పుడు 2.2 లక్షల టన్నులకు చేరుకుంటున్నది. మిగిలిన ఐదుల నెలల్లో టార్గెట్ సాధించేలా సాగుతున్నారు.