గోదావరిఖని, వెలుగు: సింగరేణి 53వ జోనల్ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలను బుధవారం నుంచి రెండు రోజుల పాటు యైటింక్లయిన్ కాలనీలోని రెస్క్యూ స్టేషన్లో నిర్వహించనున్నారు. మంగళవారం సింగరేణి కార్పొరేట్ సేప్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్వీసూర్యనారాయణ, రెస్క్యూ జీఎం కె.శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లు ఉండగా, ఆరు టీమ్‌లు పాల్గొంటాయని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20 వరకు ధన్బాద్లో బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలకు పంపించనున్నట్లు చెప్పారు.
రెస్క్యూ ప్రారంభ పోటీలకు చీఫ్ గెస్ట్లుగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్ జి.వెంకటేశ్వర్‌రెడ్డి, డీడీఎంఎస్ భూషన్ ప్రసాద్ సింగ్, డీఎంఎస్ ఉమేశ్ఎం.సావర్కర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. రెస్క్యూ జట్లకు ఫస్ట్ ఎయిడ్, డ్రిల్, కవాతు, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీ అంశాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. మీడియా సమావేశంలో ఎ.నెహ్రూ, ఎస్.అనిల్ కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ పాల్గొన్నారు.