- ఈనెల 27న ఎలక్షన్స్
- ఆరు జిల్లాలు, 11 ఏరియాలు
- పోటీలో 13 రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్లు
- ఓటేయనున్న 39,748 మంది కార్మికులు
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు అధికారులు రెడీ అవుతున్నారు.కార్మిక సంఘాలు, కార్మికులు ఎదురుచూస్తున్న ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. హైకోర్టు ఆదేశం మేరకు నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో 13 రిజిస్టర్డ్ యూనియన్లు పోటీ చేస్తుండగా సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులు అధ్యక్షతన కార్మిక సంఘాలతో మీటింగ్ నిర్వహించారు. ఓటర్ల జాబితాను వివిధ యూనియన్ల ప్రతినిధులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి (టీబీజీకేఎస్), బి.జనక్ ప్రసాద్, ఎస్.నర్సింహా రెడ్డి (ఐఎన్‌టీయూసీ), వి.సీతారామయ్య, రాజ్‌కుమార్ (ఏఐటీయూసీ), యాదగిరి సత్తయ్య (బీఎంఎస్), రియాజ్ అహ్మద్ (హెచ్‌ఎంఎస్), మంద నర్సింహారావు (సీఐటీయూ), రాజన్న (సింగరేణి ఉద్యోగుల సంఘం), రాములు (ఏఐఎఫ్‌టీయూ), ఐ.కృష్ణ (ఇప్టూ) తదితరులకు అందజేశారు. ఈనెల 6 వరకు ఓటరు లిస్టులో అభ్యంతరాలను స్వీకరిస్తారు. 8వ తేదిన ఓటర్ల ఫైనల్ లిస్ట్‌ను సింగరేణి మేనేజ్‌మెంట్ విడుదల చేయనున్నది. కాగా,13 కార్మిక సంఘాల నుంచి అక్టోబర్ 7వ తేదిన నామినేషన్లను స్వీకరించి అదే నెల 10న గుర్తులు కేటాయించారు.
కోల్ బెల్ట్‌లో గనులపై మళ్లీ ఎన్నికల సందడి
తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగియగా కోల్‌బెల్ట్ లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో సింగరేణి సంస్థ విస్తరించి ఉంది. కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, సత్తుపల్లి, భూపాలపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని నియోజకవర్గాల పరిధిలో బొగ్గుగనులు ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్జీ 1 ఏరియా, ఆర్జీ 2 ఏరియా, ఆర్జీ 3 ఏరియా పరిధిలోని గనులు, ఓసీపీలు, డిపార్ట్‌మెంట్లలో పనిచేసే నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్‌సీడబ్ల్యుఏ) కింద పనిచేసే 39,748 మంది కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వివిధ యూనియన్లు ప్రచారానికి
సిద్ధమవుతున్నాయి.
ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య పొత్తు కుదిరేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఏర్పాటు చేసుకుని కలిసి పోటీ చేసినందున సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ పార్టీలకు చెందిన ట్రేడ్ యూనియన్లు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేస్తాయా అన్న చర్చ కోల్ బెల్ట్‌లో సాగుతోంది. కాంగ్రెస్ మద్దతుతో కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఈ రెండు యూనియన్ల మధ్య సయోధ్య కుదిర్చి ఒక యూనియన్‌కు చెందిన గుర్తుపైనే పోటీ చేసేలా అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుందా అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా, గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేయనున్నారో ఇప్పటికే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అగ్రనాయకత్వం ప్రకటించింది.