సింగరేణిలో బకాయిల రగడ

  • రెండు విడతలు వద్దు.. ఒక్కసారే ఇవ్వాలంటున్న కార్మికులు 
  •  చెల్లింపు తేదీలపై స్పష్టత ఇవ్వని యాజమాన్యం 
  •  ఒక్కో కార్మికుడికి సగటున రూ.4 లక్షల చొప్పున రూ.1,726 కోట్లు చెల్లించాలె
  •  నిధులు లేకపోవడమే కారణమంటున్న కార్మిక సంఘాలు​

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణిలో వేతన బకాయిల చెల్లింపు వ్యవహారంపై రగడ కొనసాగుతున్నది. ఎరియర్లను​రెండు విడతలుగా చెల్లిస్తామని ఇటీవల ప్రకటించిన సింగరేణి యాజమాన్యం.. ఏ తేదీల్లో చెల్లిస్తామో చెప్పకపోవడంపై కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేతన బకాయిలు ఒకే దఫా చెల్లించాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన బాటపడ్తున్నారు. కార్మికులకు వేతన బకాయిలు మొత్తం రూ.1,726 కోట్లు చెల్లించాల్సి ఉంది.  కానీ, సింగరేణిని నిధుల కొరత వెంటాడుతుండటం, ఒకేదఫా భారీ మొత్తం సమకూర్చడం సాధ్యం కాకపోవడం వల్లే కార్మికులకు బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. పదకొండో వేతన ఒప్పందానికి సంబంధించి పెరిగిన జీతభత్యాలను 2021 జులై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. ఈ ఒప్పందం ఈ ఏడాది మే నెలలో కుదరగా జూన్​ నెల నుంచి చెల్లించాల్సి ఉంది. ఒప్పంద కాలపరిమితి మొదలైనప్పటి నుంచి 23 నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. సింగరేణిలో 43 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరిలో ఒక్కొక్కరికి సగటున రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. 

కోలిండియా ఆదేశాలపై స్పష్టత ఇవ్వని సింగరేణి

23 నెలల వేతన బకాయిలు సెప్టెంబర్​ మొదటి వారంలోనే చెల్లించాలని కోలిండియా యాజమాన్యం ఆగస్టులో  సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో కార్మికులు, కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో యాజమాన్యం కార్మికులకు నెలలోగా రెండు విడతల్లో వేజ్​బోర్డు బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నామని ఈనెల 1న ప్రకటించింది. బకాయిల చెల్లింపునకు భారీ కసరత్తు చేయాల్సి ఉందని పేర్కొన్నది. అయితే, ఎప్పటిలోగా చెల్లిస్తామనే తేదీలపై యాజమాన్యం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

సింగరేణికి ఆర్థిక భారమా?

సింగరేణిని నిధుల కొరత వెంటాడుతున్నదని, అందుకే వేతన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వలేదనే ప్రచారం జరుగుతున్నది. బొగ్గు విద్యుత్తు సరఫరా ద్వారా జెన్​కో, ట్రాన్స్​కోలతో ఇతర విద్యుత్తు సంస్థల నుంచి సింగరేణికి సుమారు రూ.29 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. దీనికి తోడు భారీగా వేతన బకాయిలు చెల్లించేందుకు ఫండ్స్​ లేక ఏవిధంగా పంపిణీ చేయాలన్న ఆలోచనలో పడి బకాయిలను రెండు విడతల్లో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని సమాచారం. మరోవైపు  సెప్టెంబర్​ నెలలో  వేతన బకాయిల తర్వాత ఇదే నెల చివరిలో రూ.700 కోట్ల లాభాల వాటా పంపిణీ చేయాల్సి ఉంది. ఒకే నెలలో వేతన బకాయిలు, లాభాల వాటా కలిపితే సింగరేణిపై రూ.24,026 కోట్ల భారం పడతుంది. వాటి చెల్లింపు పూర్తికాగానే అక్టోబర్​ దసరా పండుగ అడ్వాన్స్, ఆ తర్వాత దీపావళి ముందు కార్మికులకు ఏటా చెల్లించే పీఎల్ఆర్​ బోనస్​ పంపిణీకి కనీసం రూ.300 కోట్లు కావాలి. ఇలా సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లోనే సింగరేణికి రూ.3 వేల కోట్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

కాగితాలకే పరిమితమైన లాభాలు

సింగరేణి అప్పులపాలు కాలేదని, సుస్థిర లాభాల్లో ఉందని సంస్థ యాజమాన్యం ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రకటించింది. బ్యాంకులు, ఇతరత్రా సంస్థల్లో రూ.11,665 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, వాటి వల్ల ఏటా రూ.750 కోట్లకు పైడా రాబడి వస్తోందని, అలాగే వినియోగదారుల నుంచి రూ.15,500  కోట్ల బకాయిలు మాత్రమే రావాల్సి ఉందని పేర్కొంది.  2022–-23 ఆర్థిక సంవత్సరారానికి రూ.32 వేల కోట్ల టర్నోవరు, రూ.2,222 కోట్ల నికర లాభాన్ని ప్రకటించుకున్నా అవి సంస్థ వద్ద నిల్వ లేనట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విద్యుత్​ సంస్థలైన ట్రాన్స్​కో, జెన్​కోల నుంచి సింగరేణికి రూ.29 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బకాయిలను రాబట్టుకోవడంలో సింగరేణి ఆఫీసర్లు విఫలమయ్యారని, రాష్ట్ర సర్కారు ఇప్పించలేకపోతున్నదని ఆ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

ఫండ్స్​ను సర్కారు​​తరలించుకపోతున్నది 

రూ.32,830 కోట్లు టర్నోవర్​ వచ్చిందని సింగరేణి యాజమాన్యం ప్రకటించినా ఎరియర్స్​ చెల్లించడానికి స్పష్టమైన తేదీలను ఎందుకు ప్రకటించలేదు? లాభాలు, టర్నోవర్​ కేవలం కాగితాల్లో చూపుతున్నరు. రూ.వేల కోట్ల విద్యుత్తు బకాయిలు వసూలు కాకపోవడం, రాష్ట్ర సర్కారు విచ్చలవిడిగా ఫండ్స్​ తరలించడంతో  కంపెనీ వద్ద నిధులు లేవు. 
‌‌‌‌ - యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ స్టేట్​ ప్రెసిడెంట్​

ఎన్నికల లబ్ధి కోసమే వాయిదా

వేతన బకాయిల చెల్లింపులో యాజమాన్యం తేదీలు ప్రకటించకుండా రెండు వాయిదాల్లో ఇస్తామని ప్రకటించి మభ్యపెడుతున్నది. విద్యుత్తు సంస్థల నుంచి రావాల్సిన రూ.29 వేల కోట్ల బకాయిల సొమ్మును రాష్ట్ర సర్కారు​వాడుకోవడంతోనే  సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నది. ఎన్నికల ముందు కార్మిక ఖాతాలో ఎరియర్స్​ జమచేసి రాష్ట్ర సర్కారుకు ఎన్నికల లబ్ధి చేకూర్చడానికే మేనేజ్​మెంట్ ఇప్పుడు బకాయిల చెల్లింపును వాయిదా వేస్తున్నదనే ఆనుమానం ఉంది. 
- వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రెసిడెంట్