పుల్కల్, వెలుగు : సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ నుండి మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆయకట్టు రైతులకు బుధవారం ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. సింగూర్ ప్రాజెక్ట్‌లో 16 టీఎంసీలకుపైగా నీటి నిల్వలు ఉన్నప్పుడు మాత్రమే ఘనపూర్ ఆయకట్టు రైతుల కోసం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోని నీటి మట్టం 523.600 మీటర్లకు గాను 522.943 మీటర్లు కాగ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగ 27.342 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరు ఉండడంతో మొదటి విడతగా 0.35 టీఎంసీల నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. పంటల అవసరాలకు అనుగుణంగా విడతలుగా ఘనపురం ఆయకట్టు వ్యవసాయానికి సరిపడ నీళ్ళను విడుదల చేస్తారు.
గేట్ల ద్వారా కాకుండా ఈ నీరు విద్యుత్ తో పాటు పంటలకు ఉపయోగపడే విధంగా పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగే విదంగా దిగువన ఉన్న మంజీరా బ్యారేజిలోకి 2842 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అక్కడి నుండి మంజీరా నది వెంట మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్ట్ లోకి చేరుకుంటాయి. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్ల కాపరులు, మత్స్యకారులు నది లోనికి వెళ్లరాదని ఇరిగేషన్ అధికారులు కోరారు.