
- పాస్‌వర్డ్ చెప్పకుండా ఎత్తులు వేస్తున్న నిందితుడు
- ఇప్పటికే మూడు సార్లు ప్రశ్నించిన సిట్ అధికారులు
- బుధవారం మరోసారి 5 గంటల పాటు విచారణ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు అంతా శ్రవణ్‌రావు వినియోగించిన మూడు ఫోన్ల చుట్టే తిరుగుతోంది. సోదాల సమయంలో అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను అధికారులు ఓపెన్ చేసేందుకే యత్నిస్తున్నారు. అయితే, సెల్‌ఫోన్ల పాస్‌వర్డ్ చెప్పకుండా నిందితుడు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని అనుమానిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గత నెల 29 నుంచి నిందితుడు సిట్ ముందు హాజరవుతున్నాడు.
బుధవారం కూడా అతను విచారణకు హాజరయ్యాడు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చిన శ్రవణ్ రావును ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని టీమ్ 5 గంటల పాటు ప్రశ్నించింది. అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఈనెల 28 వరకు అమలులో ఉన్న నేపథ్యంలో మరోమారు విచారణకు రావాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఫోన్ పాస్‌వర్డ్‌లు చెప్పకపోయినా, దర్యాప్తుకు సహకరించకపోయినా సుప్రీంకోర్టుకు వివరించే అంశాలను పరిశీలిస్తున్నారు.
కీలకంగా మారిన శ్రవణ్‌రావు సెల్‌ఫోన్ డేటా
2023, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్‌రావు వినియోగించిన ఫోన్లు, ప్రణీత్ రావుకు అందించిన ఫోన్ నంబర్ల గురించి సిట్ అధికారులు ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించారు. ఎలక్షన్ల సమయంలో నిర్వహించిన పొలిటికల్ సర్వే వివరాలు, ప్రణీత్‌రావుకు అందించిన సమాచారం గురించి నిందితడు శ్రవణ్ వెల్లడించాడు. సిట్ అడిగిన కీలక ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శ్రవణ్‌రావు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ఆధారంగా వివరాలు రాబడుతున్నారు.
మూడు సెల్‌ఫోన్లలో ఉన్న డేటాను రిట్రీవ్ చేస్తే, కేసులో కీలక సమాచారం లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. పాస్‌వర్డ్‌లు మర్చిపోయానని శ్రవణ్‌రావు చెప్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ద్వారా డేటా రిట్రీవ్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరోసారి విచారణకు రావాలని శ్రవణ్‌రావుకు సూచించారు. ఎప్పుడు రావాలో సమాచారం ఇస్తామని చెప్పారు.