టీఎస్ పీఎస్ సీ(TSPSC) పేపర్ లీక్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. జగిత్యాల జిల్లాలోని మాల్యాల మండలంలో సిట్ ప్రత్యేక దర్యాప్తు చేస్తోంది. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులను సిట్ జల్లెడ పడుతోంది. మాల్యాల మండలంలో 40 మందికి పైగా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినట్లు గుర్తించిన సిట్.. అభ్యర్థుల శక్తి,సామార్థ్యాలను ప్రశ్నిస్తోంది. సిట్ బృందాలు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ ప్రశ్నిస్తున్నాయి.
పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. తిరుపతి గ్రామంలో చాలా మంది గ్రూప్ 1 ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారని విమర్శలు చేశాయి. ఈ క్రమంలో తిరుపతి సొంత మండలం మాల్యాల మండలంలో సిట్ విచారణ చేస్తోంది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఏప్రిల్ 3న మూడున్నర గంటల పాటు విచారించిన సిట్ ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎఫ్ఎస్ఎల్ కు పంపించింది.. ఒకటి రెండు రోజుల్లో నివేదిక రానుంది. సిట్ ఈ కేసుపై స్టేటస్ రిపోర్టును ఏప్రిల్ 11వ తేదీన హైకోర్టుకు సమర్పించనుంది.