తాగునీటి సమస్యపై ..ముందస్తు చర్యలు తీసుకోండి : సీతక్క

  • గిరిజనుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలి
  • అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
  • కెరమెరిలోని జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు.

ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : రానున్న వేసవి దృష్ట్యా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, భగీరథ నీరు ప్రతి గ్రామంలో ప్రతి రోజూ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి, కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా ఇన్​చార్జ్ సీతక్క  అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా ప్రగతిపై మంగళవారం ఉట్నూర్​లోని కేబీకాంప్లెక్స్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, బదావత్ సంతోష్, హేమంత్ బొర్కడే, ఆశిష్ సంగ్వాన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో శాఖల వారీగా సమీక్షించారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల సంక్షేమం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేయాలని, జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు, ఆయకట్టు సాగు, విస్తీర్ణం జిల్లాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అరోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ శాఖల అధికారులను ఆదేశించారు.

జిల్లాలు, శాఖల వారీగా కొనసాగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాల్లో విద్య, వైద్యం, రోడ్లు, రవాణా, నీటి సరఫరా, విద్యుత్ వంటి ఇతరత్రా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే దిశగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని సూచించారు.

వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాన్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా టెన్త్​క్లాస్ ​స్టూడెంట్లు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధించేలా వారిని సన్నద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాయల్ శంకర్, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, బొజ్జు పటేల్, హరీశ్ బాబు, అడిషనల్ కలెక్టర్లు, ఉమ్మడి జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు. 

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం

అడవి ప్రాంతంలో, గుహలో దీపం రూపంలో వెలుగుతున్న గొప్ప దేవత జంగుబాయి అని మంత్రి సీతక్క అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహారాజ్ గూడ గ్రామంలోని జంగుబాయి దేవస్థానంలో జరుగుతున్న మహాపూజ కార్యక్రమంలో కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే బొజ్జు పటేల్​తో కలిసి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జంగుబాయి ఆలయంలో తాగునీటి సౌకర్యంతోపాటు ఉమ్రి నుంచి దేవస్థానం వరకు రోడ్డు నిర్మాణం, ఇతర వసతుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆదివాసులు సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకొని భావితరాలకు అందివ్వాలన్నారు. ప్రకృతి సంపద, సహజత్వాన్ని కాపాడుకోవాలన్నారు. జంతువులు, చెట్లకు హాని చేయవద్దని కోరారు. త్వరలోనే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పాటుపడ్డారని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఆర్డర్ ఇచ్చారని తెలిపారు.