ప్రపంచంలోనే అతిపొడవైన ఇరిగేషన్ టన్నెల్ SLBC

ప్రపంచంలోనే అతిపొడవైన ఇరిగేషన్ టన్నెల్ SLBC
  • ప్రపంచంలోనే అతిపొడవైన ఇరిగేషన్ టన్నెల్ ఎస్ఎల్​బీసీ
  • పైపుల ద్వారా ఆక్సిజన్ పంప్ చేస్తూ పనులు
  • టన్నెల్​పైన మొత్తం కొండలు.. అడవులే..
  • 1980లో ప్రాజెక్ట్​కు శంకుస్థాపన చేసిన నాటి సీఎం అంజయ్య
  • పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చింది రూ.500 కోట్లే
  • 2026కల్లా కంప్లీట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతిపొడవైన ఇరిగేషన్ టన్నెల్.. ఎస్ఎల్​బీసీ. టన్నెల్ పైన మొత్తం కొండలు.. అడవులు ఉన్నాయి. టైగర్ రిజర్వ్ ఏరియా కావడంతో అటవీ సంపదకు నష్టం వాటిల్లకుండా శ్రీశైలం ఆఫ్​షోర్, కొండ కింది నుంచి ఈ టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇందులో గాలి దూరదు.. ఊపిరాడదు.. పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంప్ చేస్తుంటారు. ఇంకా 9 కిలో మీటర్ల మేర తవ్వితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అయితే, రెండు భాగాలుగా టన్నెల్ పనులు చేపడ్తున్నారు. శ్రీశైలం ఆఫ్​షోర్ నుంచి వృత్తాకార సర్కిల్​లో డిండి రిజిర్వాయర్ వరకు మొదటి భాగాన్ని తవ్వుతున్నారు. అక్కడి నుంచి గుర్రపు డెక్క ఆకారంలో మరో టన్నెల్ ను ఇప్పటికే తవ్వారు. రెండు రోజుల కింద ప్రమాదవశాత్తు పైకప్పు కూలడంతో 8 మంది టన్నెల్​లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది తవ్వకాలు చేపడ్తున్నారు.

ఆరు సార్లు ప్రాజెక్టు గడువు పొడిగింపు

ఎస్ఎల్​బీసీ టన్నెల్ నిర్మాణానికి 40 ఏండ్ల కిందే శ్రీకారం చుట్టారు. 1978లో నాటి సీఎం చెన్నారెడ్డి.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్టడీ చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. సర్వే చేసిన ఆ కమిటీ.. సొరంగం ద్వారా నీటిని తరలించాలని సిఫార్సు చేసింది. 1980లో అక్కమ్మ బిలం దగ్గర టన్నెల్ పనులకు అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల నిధులను కేటాయించారు. 1983లో ఎన్టీఆర్​ హయాంలో ఎడమ కాల్వ, కుడికాల్వల పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, అక్కడి నుంచి పనులు లేట్ అవుతున్నాయన్న ఉద్దేశంతో 1995లో ప్రాజెక్ట్​ ప్రతిపాదిత స్థలాన్ని మార్చారు. నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్​ అదే. ఆ ప్రాజెక్ట్​తో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్​కు డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నారు. అయితే, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం ఆఫ్​షోర్ నుంచి కూడా టన్నెల్ తవ్వాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2010 నాటికల్లా పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, వివిధ కారణాలతో ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. దాదాపు 6 సార్లు పనుల గడువు పెంచారు. 2026 నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రాజెక్టులో భాగంగా 2 సొరంగాలతో పాటు, హెడ్​రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, డిండి, నక్కలగండి, ఉదయసముద్రం సహా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రాజెక్టులో చేర్చారు. కాగా, టన్నెల్​ 2 నిర్మాణ పనులు పూర్తికాగా.. టన్నెల్​1లో ఇప్పటిదాకా 34.9 కిలో మీటర్ల మేర పనులను పూర్తి చేశారు.

షియర్ జోన్​లో టన్నెల్ వర్క్ ఏరియా

గత బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో ప్రాజెక్టుకు కేవలం రూ.500 కోట్లే కేటాయించి చేతులు దులుపుకున్నది. 2019, 2020, 2021 కలిపి రూ.10 కోట్లేనంటే ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆ నిధులు కనీసం నిర్వహణ ఖర్చులకూ సరిపోయే పరిస్థితి ఉండదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతం షియర్ జోన్​లో ఉందని అధికారులు అంటున్నారు. అంటే మట్టి, గులక, రాళ్లు కలగలిపిన జోన్. కొన్నేండ్లుగా పనులు పెండింగ్​లో ఉండటంతో వాటర్ లీకేజీలు ఏర్పడి భారీ సీపేజీ వచ్చిందంటున్నారు. ఇలాంటి ప్రాంతాలను రాడార్లు, సెన్సర్లతో గుర్తించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి నిరుడు బడ్జెట్​లో కాంగ్రెస్​ సర్కారు ప్రాజెక్టు కోసం రూ.800 కోట్లు కేటాయించింది. పనులు పున:ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టింది. ఆ తర్వాత నిరుడు అక్టోబర్​లో రూ.4,637 కోట్ల నిధులను విడుదల చేశారు. పనులకు సంబంధించి ఈఎన్​సీ జనరల్ నేతృత్వంలో సర్కారు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకుఅనుగుణంగా ప్రాథమిక పనుల కోసం రూ.50 కోట్లు ఖర్చవుతాయని చెప్పగా.. సర్కారు ఆ నిధులనూ విడుదల చేసింది. టన్నెల్​బోరింగ్ మెషిన్​ను తెప్పించడంతో వారం కింద పనులను అధికారులు ప్రారంభించారు.

టన్నెల్ 1: దోమలపెంట (మన్నెవారిగూడెం) 

నుంచి డిండి రిజర్వాయర్ వరకు

  • టన్నెల్ పొడవు    43.93 కిలో మీటర్లు
  • టన్నెల్ వెడల్పు/వ్యాసం     10 మీటర్లు
  • పనులు పూర్తయిన (లైనింగ్​సహా)    9.2 మీటర్లు
  • వాటర్ డిజైన్ కెపాసిటీ    4,000 క్యూసెక్కులు
  • మ్యాగ్జిమమ్ కెపాసిటీ    5,570 క్యూసెక్కులు

టన్నెల్ 2: నల్గొండ జిల్లా చందంపేట 
(తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ)

  • టన్నెల్ పొడవు     7.13 కిలో మీటర్లు
  • టన్నెల్ వెడల్పు/వ్యాసం    9.8 మీటర్లు
  • లైనింగ్​తో కలిసి పూర్తయిన వ్యాసం    8.758 మీటర్లు
  • వాటర్ డిజైన్ ఫ్లడ్​    4,000 క్యూసెక్కులు
  • మ్యాగ్జిమమ్ కెపాసిటీ    4,495 క్యూసెక్కులు