ఈ తెలుగు నేలపై మగువల తెగువకు నిలువుటద్దంలా నిలిచిన వీరనారి ఈశ్వరీబాయి. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ఆఖరి శ్వాసవరకు అలుపెరగకుండా పోరాడిన పోరు కెరటం. ఈశ్వరీబాయి అంటే మామూలు వ్యక్తి కాదు మహాశక్తి. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి జీవితాన్ని అత్యున్నతంగా, అసామాన్యంగా మలుచుకున్న మహోన్నత శిఖరం. ఈశ్వరీబాయి 1918వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతంలో, అతి సామాన్య మాల కులానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు జన్మించారు. ఎందరో మహనీయుల పరంపర నుంచి ఈశ్వరి బాయి వరకు దళిత ఉద్యమం అంచెలంచెలుగా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ‘హరించివేయబడ్డ హక్కుల్ని బిక్షమెత్తిగాని, ప్రాధేయపడిగాని సాధించలేం. అలుపెరుగని నిరంతర పోరాటాల ద్వారానే సాధించగలం’ అని బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటల్ని నరనరాన జీర్ణించుకున్న ఆమె ఏనాడు కూడా యాచించటం, అభ్యర్థించటం లేక పొగడటం, దీనంగా ప్రార్థించడం చేయలేదు. అత్యంత ధైర్య సాహసాలతో పోరాడారు.
మనం బలహీనులుగా ఉన్నంతకాలం పీడనకు గురి అవుతూనే ఉంటాం. మనల్ని ఎవరూ పట్టించుకోరు. మనం ఏమీ సాధించలేం. ఐకమత్యమే మన ఆయుధం. మనమంతా ఏకం కావాలి. మన చట్టాలు సరిగా అమలు జరిగేటట్లు చూడాలి. మానవులుగా జీవించాలంటే మనం ఈ దుష్ట వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి. మనం ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలి’ అని ఈశ్వరీబాయి కార్యకర్తలకు చెబుతూ ఉండేవారు. సమాజంలో పేరుకుపోయిన అసమానత, అణచివేతలు, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఉద్యమాల్లో ఉవ్వెత్తున పాల్గొన్న ఆమె క్షేత్రస్థాయిలో పోరాడడం ఎంత ముఖ్యమో చట్టాలు చేసే చట్టసభల్లో పోరాడడం కూడా అంతే ముఖ్యమని భావించారు. రాజకీయ పోరాటం సాగించాలని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన ‘రాజ్యాధికారం అనేది ఒక మాస్టర్ కీ, రాజ్యాధికారం ద్వారానే సామాజిక, -ఆర్థిక, -సాంస్కృతిక రంగాల్లో సమూలమైన మార్పులు తీసుకొని రావొచ్చు. రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయి’ అని మాటల స్ఫూర్తితో ఆమె రాజకీయరంగ ప్రవేశం చేశారు.
అంబేద్కరిజమే శ్వాసగా రాజకీయ ప్రస్థానం
రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిశ్చయించుకున్న ఆమె ఎవరికీ తలవంచకుండా స్వతంత్రంగా రాజకీయాలు చేయాలని 1952లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అలా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. ఒక దళిత మహిళ, స్వతంత్రంగా రాజకీయ శక్తిగా ఎదగడాన్ని సహించలేని అగ్రకుల ఆధిపత్య సమాజం నుంచి అవరోధాలు, హత్యాప్రయత్నాలు, దాడులు ఎన్ని ఎదురైనా ఆమె రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ అప్రతిహతంగా సాగిపోయింది. అనుక్షణం అంబేద్కరిజమే శ్వాసగా సాగిన ఆమె.. అంబేద్కర్ ఆలోచనా విధానమే పునాదిగా రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. సమసమాజ భారత్ లక్ష్యంగా ఏర్పడ్డ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో 1962లో ఆమె చేరారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు దేశంలో, ఇటురాష్ట్రంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.ఎన్.సదాలక్ష్మిపై నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయదుందుభి మోగించి తెలుగు గడ్డపై నీలిరంగు జెండాను రెపరెపలాడించిన నిజమైన అంబేద్కర్ వారసురాలు ఆమె. 1972లో జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్యపై గెలుపొంది మొదటిసారి గెలుపు గాలివాటం కాదని నిరూపించి చరిత్ర సృష్టించారు.
తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆమె అలుపెరగకుండా ఉద్యమంలో పాల్గొన్నారు. చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజానీకానికి వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను అధ్యయనం చేయడానికి తెలంగాణ పది జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధాన నాయకత్వం మొత్తం జైలు పాలయినపుడు ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిన నిజమైన తెలంగాణ తల్లి ఈశ్వరీబాయి. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పోలీస్ లాఠీ దెబ్బలతో, తుపాకీ తూటాలతో అతి క్రూరంగా అణచివేయడం అప్రజాస్వామికమని ఆంధ్ర పాలకులపై అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో దళిత పాలేరు కోటేసును కొంత మంది పెత్తందార్లు సజీవదహనం చేసిన సమయంలో ఆమె అసెంబ్లీలో స్పందించిన తీరు అనిర్వచనీయం. ఈ సంఘటనపై అసెంబ్లీలో ఆమె పట్టుబట్టి మరీ చర్చకు తీసుకొచ్చిన సందర్భంలో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మారెడ్డి చర్చ మధ్యలో కలుగజేసుకొని ‘దొంగతనం చేస్తే కాల్చి చంపకుండా ముద్దు పెట్టుకుంటారా?’ అని అనగానే ‘ఎవడురా ఆ కూత కూసినవాడు, దళితులు మీకు దొంగల్లా కనిపిస్తున్నార్రా! సాటి మనిషిని సజీవ దహనం చేస్తారా? దళితులను దొంగలు అంటే చెప్పుతో కొడతా’ అని ఆయన మీదకి చెప్పు విసిరి తగిన సమాధానం చెప్పిన తీరు చారిత్రాత్మకమైనది.
మహిళలు, రైతుల శ్రేయస్సు కోసం తాపత్రయం
నిండు సభలో రైతుల శ్రేయస్సు కోసం తాపత్రయ పడిన తల్లి ఈశ్వరీబాయి. సమాజంలో సమూలమైన మార్పులు రావాలంటే విద్య ద్వారానే సాధ్యమని చెప్పిన అంబేద్కర్ మాటల స్ఫూర్తితో ఆమె అట్టడుగు వర్గాలకు సైతం నాణ్యమైన విద్య అందాలని అసెంబ్లీలో గర్జించేవారు. స్త్ర్రీ విద్య గురించి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర జనాభాలో సగం ఉన్న స్త్రీలకు విద్యా సౌకర్యాలు కల్పించే విషయంలో శ్రద్ధ వహించడం చాలా అవసరం. స్త్రీలు అధిక సంఖ్యలో విద్యావంతులైతే సాంఘిక
దురాచారాలు అంతమవుతాయి. స్త్రీ విద్యతో పాటు, నిరక్షరాస్యతా నిర్మూలనకు కూడా ఎంతో కృషి జరగాల్సి ఉంది అన్నారు. ఈశ్వరీబాయి ఒకవైపు క్షేత్రస్థాయిలో, మరోవైపు అసెంబ్లీలో నిరంతరం పోరాడుతూ చివరికి 1990 ఫిబ్రవరి 24వ తేదీన మహాపరినిర్వాణం చెందారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయి ఉండి కూడా నిరాడంబర జీవితాన్ని గడిపిన నిగర్వి, నిస్వార్థ ప్రజాసేవకురాలు. సమాజంలో అసమానతలను అంతమొందించి.. స్వేచ్ఛ, -సమానత్వం, -సౌభ్రాతృత్వం వెల్లివిరిసే సమసమాజ స్థాపన కోసం తాడిత, పీడిత జనం ఎత్తే ప్రతి పిడికిలిలో ఆమె రూపం చిరస్మరణీయం.
- డా. మంచాల లింగస్వామి
ఉస్మానియా యూనివర్సిటీ