ఆగస్టులోగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రెడీ

ఆగస్టులోగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రెడీ
  • రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ 
  • నిర్మాణ పనుల పరిశీలన

కాజీపేట, వెలుగు : ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వచ్చే ఏడాది ఆగస్టులోపు అందుబాటులోకి తెస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. శుక్రవారం కాజీపేట జంక్షన్ లోని అయోధ్యపురంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. లింక్ హాప్ మన్ బుష్ (ఎల్ హెచ్ బీ), సబర్మన్ రైళ్లకు వాడే ఎలక్ర్టిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) కోచ్ ల షెడ్ లను సందర్శించారు. వ్యాగన్, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నమునాపై అధికారులతో సంబంధిత చర్చించారు. 

అనంతరం జీఎం మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ పనులను వచ్చే ఏడాది ఆగష్టులోగా పూర్తి చేసేలా స్పీడప్ పెంచామని చెప్పారు. మోడ్రన్ టెక్నాలజీతో వ్యాగన్ లు,కోచ్ లు ఏడాదికి 600 తయారవుతాయని పేర్కొన్నారు. జీఎం వెంట సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్, కాజీపేట రైల్వే విభాగాల అధికారులు ఉన్నారు.  అనంతరం  అమృత్ భారత్ లో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్ లో చేపట్టిన పనులను పరిశీలించారు. 

కాజీపేట జంక్షన్ ను రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని రైల్వే జేఎసీ ప్రతినిధులు దేవులపల్లి రాఘవేందర్, కొండ్ర నర్సింగరావు రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సైట్ ఆఫీసులో జీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. రైల్వే పాలి క్లినిక్ ను డివిజనల్ హాస్పిటల్ గా ఆప్ గ్రేడ్ చేయాలని, రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ బిల్డింగ్ కొత్తగా నిర్మించాలని, ఎలక్ర్టిక్ లోకో పీవోహెచ్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు.