డీలిమిటేషన్​పై పునరాలోచన అవసరం

డీలిమిటేషన్​పై పునరాలోచన అవసరం

పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాల నాయకులు  తార్కికంగా, న్యాయబద్ధంగా జరగాలని మాత్రమే కోరుకుంటున్నారు. అందులో తప్పులేదు. కానీ, ఆ చర్య అసమంజసమైన, అధర్మమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించేదిగా ఉండకూడదు.  కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు జనాభా పెరుగుదలను సమర్థవంతంగా అరికట్టినందుకు దక్షిణాదికి.. దండలు పోయి దండనే మిగిలేవిధంగా లోక్​సభలో వారి ప్రాతినిధ్యం తగ్గితే అది అన్యాయమే. 

జనాభా ప్రాతిపదికన జరగబోయే  లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్,  హిమాచల్​ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కాశ్మీర్ లాంటి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా నష్టపోవడం జరుగుతుంది. 

రాజ్యాంగంలోని  82వ ఆర్టికల్ నిర్దేశించిన ప్రకారం ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి జరిగే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్  ప్రక్రియను  చేపట్టాలి.‌‌‌‌  ఒక లోక్​సభ సభ్యుడు అధికసంఖ్యలో జనాభాగల పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి  ప్రాతినిధ్యం వహిస్తే,  మరొక పార్లమెంట్ సభ్యుడు తక్కువ సంఖ్యలో ఉన్న చిన్నపాటి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. కాబట్టి, జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో పార్లమెంటేరియన్ల సంఖ్యను నిర్ణయించడం జరుగుతుంది.

కానీ, 1971 తర్వాత  కారణాంతరాల వల్ల అది జరగలేదు.‌‌‌‌ ఆనాటి అభ్యంతరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రధాని ఇందిరాగాంధీ, బీజేపీ తరఫున ఎన్నికైన ప్రధాని వాజ్ పేయ్ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణతో 25 ఏళ్లపాటు రెండుసార్లు వాయిదాలు వేశారు.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరొక పర్యాయం 25 ఏళ్ల వాయిదా ఆశిస్తున్న దక్షిణాది నాయకుల కోరికనూ తప్పుపట్టలేం. 

కోల్పోయే వాటా 

ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటేరియన్లకు అవసరమైన కొత్త పార్లమెంట్ భవనంలో 888 సీట్లను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో ఊహించవచ్చు.  ఆ విధంగా 888 సీట్లకు పెంచే ప్రతిపాదనతో తాజాగా 2026 జనాభా లెక్కల ప్రకారం  పునర్విభజన జరిగితే.. 131 పార్లమెంట్ స్థానాలతో 23.76% వాటా కలిగి ఉన్న దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెరిగినా వారి వాటా 14.53%కి పడిపోవచ్చు.  సీట్ల కన్నా వాటా గురించే ఆందోళన చెందుతున్న దక్షిణ భారతదేశపు నాయకులకు కేంద్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ పరిణామం వల్ల మిగతా పార్టీల నాయకులతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కూడా నష్టపోతారు. ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తగ్గబోయే వాటా గురించి మాట్లాడకుండా,  సీట్లు పెరగడం వల్ల రాబోయే ఎన్నికల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? 

బీజేపీ నాయకుల విమర్శలు 

 న్యాయబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం వివిధ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమై సంఘటితంగా      కార్యాచరణ రూపొందించుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించడం తగదు.  స్థానిక బీజేపీ నాయకులు అందరి అనుమానాలను నివృత్తి చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడితే ఫర్వాలేదు. కానీ, ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, డీలిమిటేషన్​తో  డీల్  కుదుర్చుకొని  రాష్ట్రంలో  కాంగ్రెస్, బీఆర్ఎస్​ కలిసి పోయాయని,  ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలు సీనియర్ నాయకుల స్థాయికి తగదు. 

కేంద్రం తలపెట్టిన జమిలి  ఎన్నికలను  బీఆర్ఎస్​ సమర్థించింది.  అంతమాత్రాన బీజేపీతో కలిసిపోయినట్టు కాదు కదా.  న్యాయపరమైన బీసీ రిజర్వేషన్లు,  ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి బీజేపీ, బీఆర్​ఎస్ రెండూ  సమర్థించాయి.  అంతమాత్రాన అవి అధికార పార్టీతో  డీల్ కుదుర్చుకున్నట్టు కాదు.  అంశాల  ప్రాతిపదికపై హేతుబద్ధంగా ఎవరు ఎవరితోనైనా కలిసి పోరాటం చేసి సమైక్యంగా తమ వాణిని వినిపించవచ్చు. 

కేంద్ర నాయకుల వాదన  

ఇంతవరకు  డీలిమిటేషన్​పై  మార్గదర్శకాలే  లేవు.  దక్షిణాదికి  సీట్లు తగ్గవని అమిత్ షా  ప్రకటనను పదేపదే  బీజేపీ నేతలు ఉటంకిస్తున్నారు.  అనవసరమైన  అపోహలు, భయాందోళనలు సృష్టిస్తూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తున్నామని  కేంద్ర ప్రభుత్వం చెప్పనిదే ఎందుకు అపోహలు సృష్టిస్తున్నారు అనేది బీజేపీ వారి వాదన.‌‌‌‌  పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికనే జరగాలనే విషయాన్ని రాజ్యాంగంలోని 83వ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది.

మరి ఏ ప్రాతిపదికన పునర్విభజన చేస్తారో వెల్లడించకుండా దక్షిణాదిలో సీట్లు తగ్గవు అని ముక్తాయిస్తే సరిపోదు.  నిజానికి దక్షిణాదికి సీట్లు తగ్గవన్న  ప్రకటనలోనే తిరకాసు ఉంది.  దక్షిణాది సీట్ల సంఖ్య తగ్గకుండా అలాగే ఉంచి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లను జనాభా ప్రాతిపదికన పెంచడం వల్ల జరిగే  పరిణామాన్ని గ్రహించలేనంత అమాయకులుకారు  కదా దక్షిణాది ప్రజలు. 

భవిష్య కార్యాచరణ 

పునర్విభజన  అంశంపై  తమిళనాడు  ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన  చెన్నైలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేకమంది ముఖ్య నాయకులు పాల్గొన్న మొట్టమొదటి  సంయుక్త సమావేశం విజయవంతంగా జరిగింది. జనాభా ప్రాతిపదికన జరిగే ప్రక్రియను అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు.  పునర్విభజన  ప్రక్రియపై తెలంగాణ శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి  విజ్ఞప్తి చేయడం జరిగింది.‌‌‌‌ కేంద్రంపై  నిరంతరం రాజకీయ ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఖచ్చితంగా నష్టపోతున్న 
రాష్ట్రాలదే.  నష్టపోతున్న రాష్ట్రాలకు దక్షిణాది, ఉత్తరాది అనే హద్దులేమీ లేవని విషయాన్ని కూడా అందరూ గమనించాలి.

దక్షిణాది పార్టీల భయాందోళనలు 

ఒకే ప్రాంతంలో గల కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అధికార కేంద్రీకరణ జరిగితే సమైక్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. ఉత్తరాది నాయకుల ప్రాబల్యం పెరగడం వల్ల సమతుల్యత దెబ్బతింటుంది. దక్షిణాది వాతావరణానికి అనుకూలమైన వనరులు విధానాలు కొరవడి స్థానిక యువకులకు,  రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. 

ఉత్తరాది మెజారిటీగా మారి దక్షిణాది మైనారిటీగా మిగిలిపోవడంతో,  దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం, సమ్మతి లేకుండా చట్టాలు రూపొందించడంలో ఉత్తరాదివారిదే  పైచేయిగా మారుతుంది.‌  అరకొర నిధుల పంపిణీ మరింత అసమంజసంగా తయారవుతుంది.

 ఇప్పటికే రూపాయి ఇచ్చి 41 పైసలు మాత్రమే తిరిగి పొందే పరిస్థితి ఉందని తెలంగాణ సీఎం అంటున్నారు.   దాంతో చట్టబద్ధమైన వాటా కోసం ఆరాటం, పోరాటం మొదలవుతుంది.  దక్షిణాదిలో సృష్టించిన సంపద ఉత్తరాదికి మార్పిడి జరిగి సొమ్మొకడిది సోకొకడిదిగా అనుభవించే పరిస్థితి  ఏర్పడుతుంది. 2023–-24 జాతీయ జీడీపీలో దాదాపు 30% వాటాను దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక,  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ,  తమిళనాడు  అందించాయి.  సంపద సృష్టికి,  దేశ  ఆర్థికవ్యవస్థలో  పోషించిన పాత్రకి  కూడా గుర్తింపు  కోల్పోతే దక్షిణాదికి  సామాజిక న్యాయం కొరవడుతుంది. 

-ఆర్​సీ కుమార్​,సోషల్​ ఎనలిస్ట్​