
అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. మే 30 2024 గురువారం రోజు కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఒకరోజు ముందే గురువారం (మే 30) కేరళలోకి వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అనుకున్నట్టే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతవరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండడంతో రుతుపవనాల ఎంట్రీకి మార్గం సుగమమైనట్టు అధికారులు చెబుతున్నారు. కేరళలోకి ప్రవేశించిన నాలుగు రోజుల తర్వాత మన రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి జూన్ 10లోపు రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తొలుత అధికారులు చెప్పినప్పటికీ.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండడంతో జూన్ 5లోపే రావొచ్చని వెల్లడిస్తున్నారు.
ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని సెకండ్ లాంగ్ రేంజ్ ఫోర్ కాస్ట్‌లో వాతావరణ శాఖ తెలిపింది. అంతకుముందు ఏప్రిల్‌లో విడుదల చేసిన తొలి అంచనాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. అయితే, సెకండ్ ఫోర్ కాస్ట్‌లో మాత్రం సాధారణం కంటే ఎక్కువే వర్షాలు పడతాయని వెల్లడించింది. 106 శాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఎల్ నినో న్యూట్రల్ కండిషన్స్ ఏర్పడతాయని, మాన్‌సూన్ పురోగమిస్తున్న కొద్దీ లానినా పరిస్థితులు వస్తాయని తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.