మహాదేవపూర్, వెలుగు : మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా ఉంచాలని, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నందున మావోయిస్టుల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాటారం డీఎస్పీ జి. రామ్ మోహన్ రెడ్డి, మహదేవపూర్ సీఐ రామచంద్రరావు, ఎస్ ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.