దోషులకు శిక్ష పడేలా కృషి చేయాలి : శరత్ చంద్ర పవార్

దోషులకు శిక్ష పడేలా కృషి చేయాలి  :  శరత్ చంద్ర పవార్
  • ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ అర్బన్, వెలుగు : తప్పు చేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుముఖం పడతాయని, ప్రతి కేసులో దోషులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. సోమవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. కేసు తుది దశలో సాక్షులు, నిందితులు, బాధితులు సమయానికి కోర్టులో హాజపర్చేలా చూడాలని చెప్పారు. 

నేరస్తులకు శిక్షలు పడేలా పనిచేయడంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారితోపాటు కోర్టు డ్యూటీ సిబ్బందికి చాలా బాధ్యత ఉంటుందన్నారు. గత ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో ఒక్కరికి ఉరిశిక్ష పడగా, 17 మందికి జీవిత ఖైదు విధించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభిందినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీవాణి, అఖిల, వెంకటేశ్వర్లు, జవహర్ లాల్, రంజిత్ కుమార్, కోర్టు డ్యూటీ  అధికారులు పాల్గొన్నారు.