స్వాతంత్య్ర  పోరాటానికి, ఆధునిక భారతానికి వారధి

స్వాతంత్య్ర  పోరాటానికి, ఆధునిక భారతానికి వారధి

మారుమూల గ్రామంలో పుట్టి స్వతంత్ర భారతానికి రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన మహోన్నతుడు బాబూ రాజేంద్రప్రసాద్. రాష్ట్రపతికి పార్టీలతోనూ, రాజకీయాలతోనూ సంబంధాలు ఉండకూడదని కొత్త సంప్రదాయానికి తెర తీసిన మార్గదర్శి. అటు స్వాతంత్య్ర  పోరాటానికి, ఇటు ఆధునిక భారత నిర్మాణానికి వారధిగా నిలిచిన అసామాన్యుడు. గొప్ప మానవతావాది కూడా అయిన ఆయన.. బెంగాల్, బీహార్‌‌ వరదల సమయంలో లక్షలాది రూపాయల విరాళాలు సేకరించి బాధితులను ఆదుకున్నారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడే కాదు.. భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. రాజ్యాంగ సభకు అధ్యక్షత వహించింది ఆయనే. హిందీ, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లిష్​​ భాషల్లో పండితుడైన బాబూ రాజేంద్రప్రసాద్​ను ప్రజలు ప్రేమగా 'బాబూ' అని పిలిచేవారు.

బీహార్ లోని శివాన్ జిల్లా జిర్దేయి గ్రామంలో 1884లో డిసెంబరు 3న కమలేశ్వరీ దేవి, మహదేవ్ సహాయ్ దంపతులకు రాజేంద్రప్రసాద్​ జన్మించారు. ఐదో యేటనే పర్షియన్ భాషను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ దగ్గర చేరారు. ఛాప్రా ప్రభుత్వ బడిలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్న ఆయన అటువైపు దృష్టి మరల్చారు. ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చదివాక, బీఎల్ ఆ తర్వాత ఎంఎల్ పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందారు. రాజేంద్రప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఇడెన్ హిందూ హాస్టల్​లో ఉన్నారు. అక్కడే అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్ని నడిపారు. తొలుత న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన రాజేంద్రప్రసాద్​ అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటం వైపు ఆకర్షితులయ్యారు. 1918లో ‘సెర్చ్ లైట్’ అనే ఇంగ్లిష్  పేపర్​ను, ఆ తర్వాత ‘దేశ్’ అనే హిందీ పేపర్​ను కూడా నడిపారు. 

పేదల కోసం తన వంతు సాయం
1921లో మహాత్మాగాంధీతో సమావేశం తర్వాత విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేసి పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ ఆయనకు పిలుపునిచ్చారు. దీంతో తన కుమారుడు మృత్యుంజయ ప్రసాద్​ను విశ్వవిద్యాలయ చదువు మానిపించి బీహార్ విద్యాపీఠ్​లో చేర్చారు. ఈ విద్యాపీఠాన్ని 1921లో తన మిత్ర బృందంతో కలిసి స్థాపించిన రాజేంద్రప్రసాద్.. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దానిని నడిపారు. 1924లో బీహార్, బెంగాల్ లో వచ్చిన వరదల్లో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడానికి తన వంతు సహాయాన్ని అందించారు. 1934 జనవరి 15న బీహార్​లో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్ జైలులో ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనను విడిచి పెట్టారు. బయటకు రాగానే భూకంప బాధితుల కోసం నిధులను సేకరించడం మొదలుపెట్టారు. అలా అప్పట్లో ఆయన సేకరించిన నిధులు(రూ.38 లక్షలు).. అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలు ఎక్కువ.

రాజ్యాంగ రూపకల్పనలో..
1931లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాల్లో రాజేంద్రప్రసాద్​ చురుకుగా పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. 1946 ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వంలో ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. నుదీర్ఘకాలం పాటు పరాయి పాలనలో మగ్గిన మనదేశానికి.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, పీడనకు గురైన వర్గాలు ఉన్న సువిశాల దేశంలో ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక పెద్ద సవాల్. ఈ నేపథ్యంలో దేశ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ చైర్మన్ గా పండిత్ గోవింద్ వల్లభ్ పంత్, కేఎం మున్షీ, అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, అయ్యంగార్, బీఎల్ మిట్టర్, ఎండీ సాదుల్లా, డీపీ ఖైతావ్, ఖైతాప్ మరణానంతరం టీటీ కృష్ణమాచారి పర్యవేక్షణలో రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్ 26న బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ సభలో సర్దార్ వల్లభ్​భాయి పటేల్ రాజ్యాంగాన్ని ప్రతిపాదించి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. చేతి రాతతో హిందీ, ఇంగ్లిష్​లో సిద్ధం చేసిన ప్రతులను రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేసి 1950 జనవరి 24న 284 మంది సభ్యుల సంతకాలతో అమోదించారు. రెండు రోజుల తర్వాత 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే మన రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగినదంటూ మన్ననలు పొందింది. 

తొలి రాష్ట్రపతిగా సేవలు
1948 నుంచి 1950 వరకు రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచిన సంఘానికి రాజేంద్రప్రసాద్​ అధ్యక్షత వహించారు. 1950లో మనదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత ఆయన రాజ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1951 సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవుల్లో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకుగానూ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు. 1957లో రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికై, రెండు సార్లు ఆ పదవిని అలంకరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. 

రాజ్యాంగమే సుప్రీం
రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత సర్వసత్తాక.. సార్వభౌమ.. ప్రజాస్వామ్య దేశంగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుందని దేశ ప్రజలకు హక్కులు దక్కాయి. ప్రజలు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎంచుకునే స్వేచ్ఛను రాజ్యాంగమే కల్పించింది. దేశానికి రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి, రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్లు ఉండేలా నిర్దేశించారు. దేశాన్ని పరిపాలించడానికి ప్రధానమంత్రి, మంత్రిమండలి.. రాష్ట్రాలను పరిపాలించడానికి సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి నిర్మాణానికి రాజ్యాంగం చోటు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగ బాధ్యతలను అప్పగించింది. మనది లిఖిత రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా రూపొందించబడతాయి. అంతేకాదు దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాజ్యాంగానికి లోబడి సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు వందకు పైగా రాజ్యాంగ సవరణలు చేశారు. రాజ్యాంగం పీఠిక ప్రజల రోజు వారి జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక, సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేస్తోంది. అందుకే మన రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో విశిష్టమైన స్థానం లభించింది.

రాజకీయ జోక్యానికి అవకాశం ఇవ్వలేదు: దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్రంగా మెలిగి, ప్రధానిని గానీ, పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యం చేసుకోనివ్వలేదు. అలా తన తర్వాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచారు. 1962 వరకు అంటే సుమారు 12 సంవత్సరాలపాటు రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్​ సేవలు అందించారు. ఆ తర్వాత కాలంలో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది. తన మరణానికి నెల రోజుల ముందు తనకు తానే ఒక లేఖ రాసుకున్నారు రాజేంద్రప్రసాద్. అందులో “నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తోంది. ఏదైనా చేసే శక్తి అంతమవుతోంది. నా ఉనికే అంతమవుతోంది” అని పేర్కొన్నారు. 1963 ఫిబ్రవరి 28న తుదిశ్వాస విడిచారు బాబూ రాజేంద్రప్రసాద్. ఆయన దార్శనికతలో రూపొందిన రాజ్యాంగమే మనకు దిక్సూచిగా మారింది. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం ఏర్పడిన 66 ఏండ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని 2015 నవంబర్ 26న జరుపుకుంది. రాజ్యాంగం గొప్పదనాన్ని ప్రజలంతా గుర్తు చేసుకొని, రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. 2015 నుంచి ప్రతి నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నాం. ప్రభుత్వ ఆఫీసుల్లో, విద్యా సంస్థల్లో ఆ రోజు రాజ్యాంగం గురించి అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం.
- డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా