సమ్మర్​ యాక్షన్​ ప్లాన్ షురూ!

సమ్మర్​ యాక్షన్​ ప్లాన్ షురూ!
  • ఇవాల్టి నుంచి మిషన్​భగీరథపై స్పెషల్ డ్రైవ్
  • పంచాయతీరాజ్, ఆర్​డబ్ల్యూఎస్​ఆఫీసర్లతో టీమ్  
  • 10 రోజుల పాటు బల్క్, ఇంట్రా సప్లై తీరుపై ఫీల్డ్ సర్వే
  • ప్రతీ వ్యక్తికి రోజుకు 100 లీటర్లు అందించడమే లక్ష్యం

ఖమ్మం, వెలుగు : వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో మిషన్​ భగీరథ పని చేస్తున్న తీరుపై పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్​ నిర్వహించనున్నారు. ​పంచాయతీరాజ్, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులు టీమ్​లుగా ఏర్పడి శనివారం నుంచి ఈనెల 10  వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. జిల్లా ఆఫీసర్ల నుంచి, గ్రామాల్లో కార్యదర్శుల వరకు ఫీల్డ్ సర్వేలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ స్పెషల్ డ్రైవ్​ కు సంబంధించిన సర్క్యులర్​ జిల్లా అధికారులకు అందింది. 

క్షేత్ర స్థాయిలో ఏయే అంశాలను పరిశీలించాలనే అంశంపై చెక్​ లిస్ట్ ను అందజేశారు. తర్వాత బల్క్​ సప్లై స్కీమ్​ కు సంబంధించి 11 అంశాలతో, గ్రామీణ స్థాయిలోఉన్న సౌకర్యాల గురించి 15 అంశాలతో డేటా రిపోర్ట్ ను సమర్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి శుక్రవారం డీపీవో, ఆర్డబ్ల్యూఎస్​ అధికారులు కలిసి ఎంపీడీవోలతో వర్చువల్ మీటింగ్​నిర్వహించారు. ఆ తర్వాత గ్రామాల లెవల్లో కార్యదర్శులతో సమావేశమై ఫీల్డ్ సర్వేకు సంబంధించిన షెడ్యూల్ ను సిద్ధం చేశారు. 

ఒక్కొక్కరికి రోజుకు 100 లీడర్లు.. 

జిల్లా, డివిజన్, మండల పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శులు, ఆర్​డబ్ల్యూఎస్​ సీఈ నుంచి ఏఈఈ వరకు పది రోజులపాటు గ్రామాల బాట పట్టనున్నారు. తాగునీటి సరఫరాలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. వచ్చే ఐదు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతీ వ్యక్తికి రోజుకు100 లీటర్ల చొప్పున నీటిని అందించే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టారు. 

పరిశీలించే అంశాలివే..

గ్రామాలు, అర్బన్​ ప్రాంతాలకు వెళ్లే బల్క్​ వాటర్ సప్లై వ్యవస్థ సరిగా పనిచేస్తుందా.. లేదా, ఇంట్రా సప్లయ్​ లో లోపాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోనున్నారు. 

ఎక్కడైనా పైపుల్లో లీకేజీ, ట్యాంకులకు సంబంధించిన సమస్యలు ఉంటే, వాటిని సరిదిద్దేందుకు ఎంత సమయం పడుతుందనేది ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. 

గతేడాది సమ్మర్​లో సమస్యలు ఎదురైన గ్రామాలపై స్పెషల్ ఫోకస్​ పెట్టనున్నారు. 

భూగర్భ జలాలు పడిపోయి ఎక్కడైనా సమస్య తలెత్తితే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే మోటార్లను రిపేర్​ చేసుకోవడం, మోటార్​పంప్ సెట్లకు నీరు అందకపోతే అందుబాటులో ఉన్న వ్యవసాయ బోర్లను మాట్లాడి పెట్టడం, వ్యవసాయ బోర్లు కూడా అందుబాటులో లేకపోతే చివరి ఆప్షన్​ గా గ్రామ పంచాయతీ ట్యాంకర్లు కూడా క్లీన్​ గా పెట్టుకొని సమీపంలో ఉన్న గ్రామాల నుంచి తరలించే ప్లాన్​ చేస్తున్నారు. 

నీటికి ఇబ్బందిలేకుండా చర్యలు చేపడుతున్నాం..

ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తూ పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్​ ను ఇవాల్టి నుంచి ప్రారంభిస్తాం. జిల్లాలో 969 హ్యాబిటేషన్లకు గాను 959 హ్యాబిటేషన్లకు మిషన్​ భగీరథ నీరందిస్తున్నాం. మరో వారం రోజుల్లో ఇంకో 7 హ్యాబిటేషన్లకు కూడా నీరందించే ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది అక్టోబర్​ లోనే అన్ని స్కీమ్​ లు, ట్యాంక్​ లు సహా క్షేత్ర స్థాయిలో పరిశీలించాం. 

పంప్​సెట్లు రిపేర్​ఉన్నాయా, ఏవైనా డ్యామేజీ అయ్యాయా అని చెక్​చేశాం. ఇప్పుడు మరోసారి సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వచ్చే ఐదు నెలల పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.  - పుష్పలత, ఆర్​డబ్ల్యూఎస్ ఈఈ, ఖమ్మం