ములుగు, వెలుగు : ములుగు మండలం జంగాలపల్లిపై జరుగుతున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని డీఎంహెచ్‌వో గోపాల్ రావు సూచించారు. సోమవారం గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించి రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్, ఇతర వైద్యులు సిబ్బంది ఇల్లిల్లు తిరుగుతూ ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో గోపాల్ రావు మాట్లాడుతూ క్వాలిఫ్ కాని వారి వద్ద చికిత్స తీసుకోవద్దని, పౌష్ఠికాహారం తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించి 180మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 22మంది నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. కార్యక్రమంలో పోషణ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, ఇన్చార్జి మాస్ మీడియా ఆఫీసర్ సంపత్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ దుర్గారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మాతృ మరణాలను తగ్గించాలి
మహబూబాబాద్: జిల్లాలో మెటర్నల్ డెత్ రేట్‌ను తగ్గించాలని డీఎంహెచ్‌వో మురళీధర్ అన్నారు. సోమవారం మహబూబాబాద్జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయాలని, సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రమీల, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.