మూసీ నిర్వాసిత పిల్లలకు కొల్లూరులో స్పెషల్​ స్కూల్

మూసీ నిర్వాసిత పిల్లలకు కొల్లూరులో స్పెషల్​ స్కూల్
  •  డబుల్​ ఇండ్ల కాంపౌండ్​లోనే  పెట్టేందుకు సన్నాహాలు 
  • 120 మంది స్టూడెంట్స్ కు దగ్గరలో పాఠశాల లేక ఇబ్బందులు  
  • ప్రైమరీ స్కూల్​కు ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగారెడ్డి విద్యాశాఖాధికారులు
  • రెండ్రోజుల్లో కలెక్టర్ ​వద్దకు ఫైల్​ పర్మిషన్ ​రాగానే  ఓపెనింగ్​  

హైదరాబాద్ సిటీ/సంగారెడ్డి:మూసీ రివర్ బెడ్​ నుంచి కొల్లూరులోని డబుల్ బెడ్​రూం ఇండ్లకు వెళ్లిన నిర్వాసితుల పిల్లల కోసం డబుల్ ఇండ్ల పరిసరాల్లోనే ప్రభుత్వ స్కూల్​ను ఏర్పాటు చేసేందుకు సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డబుల్​ఇండ్లకు ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూళ్లు దూరం ఉండడంతో  పేరెంట్స్​తమ పిల్లలను బడులకు పంపించడానికి భయపడుతున్నారు. అలాగే, మూసీ నిర్వాసితులు కొల్లూరులోని డబుల్​ఇండ్లకు వెళ్లడంతో అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో వారికి అనుగుణంగా ఉండేలా అధికారులు డబుల్​ఇండ్ల దగ్గరే ప్రైమరీ స్కూల్​ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో స్కూల్​ ఏర్పాటు చేస్తే, ప్రైవేట్​స్కూళ్లకు పంపేవారు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ స్కూల్​లో చేర్పిస్తారని అధికారులు భావిస్తున్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో ఫేజ్​–1, ఫేజ్​–2 లో దాదాపు 15,600 డబుల్ ఇండ్లను నిర్మించారు. డబుల్ టౌన్​షిప్​వద్ద ప్రత్యేకంగా స్కూళ్లు, పోలీస్ స్టేషన్, సబ్​స్టేషన్​తదితర వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీలు ఆచరణకు నోచుకోలేదు. ఈ డబుల్ ఇండ్లలో ఇదివరకు 800 కుటుంబాలకు పైగా నివాసం ఉండేవారు. మిగతా ఇండ్లు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం మూసీ నిర్వాసితులకు ఆ ఇండ్లను కేటాయిస్తున్నారు. త్వరలో మిగతా ఇండ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించే అవకాశం ఉంది. 
  
120 మంది స్టూడెంట్స్ గుర్తింపు

మూసీ సుందరీకరణలో భాగంగా రివర్​బెడ్​ప్రాంతంలో ఉన్న ఇండ్లను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. రివర్​ బెడ్​నిర్వాసితులకు సిటీ సమీపంలోని డబుల్​బెడ్​రూం ఇండ్లను కేటాయించింది. అలాగే, నిర్వాసితులకు ఉపాధి కల్పించడంతో పాటు, వారి పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్​సర్కారు హామీ ఇచ్చింది. అందులో భాగంగా అధికారులు...నిర్వాసితులు ఉంటున్న డబుల్​బెడ్​రూం ఇండ్లలో సర్వే నిర్వహించారు. చదువుకునే పిల్లల్ని గుర్తించి సమీప స్కూళ్లలో జాయిన్​ చేయిస్తున్నారు. అయితే, కొల్లూరులోని డబుల్ బెడ్​రూం ఇండ్లలో జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించగా 120 మందికి పైగా పిల్లలున్నట్లు గుర్తించారు. వారి కోసం డబుల్​ ఇండ్ల అపార్టుమెంట్ కిందే ప్రైమరీ స్కూల్​ నిర్వహించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో ప్రతిపాదనలను కలెక్టర్ కు పంపనున్నారు. ఆయన నుంచి పర్మిషన్​రాగానే సాధ్యమైనంత తొందరగా స్కూల్​ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ స్కూల్​ అందుబాటులో వస్తే... తమ పిల్లల్ని బయటకు పంపకుండా ప్రభుత్వ స్కూళ్లలోనే జాయిన్ చేయిస్తామని నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.