స్టార్టప్​: ఎక్కడైనా దొరికే ఇంటి భోజనం!

స్టార్టప్​: ఎక్కడైనా దొరికే ఇంటి భోజనం!

ఫైవ్​ స్టార్​ హోటళ్లలో పెద్ద పెద్ద చెఫ్​లు చేసే వంటలకు కూడా ఇంటి భోజనం రుచి రాదు. అందుకే సొంతూరికి దూరంగా ఉండేవాళ్లకు ఇంటి భోజనం రుచిని పంచాలి అనుకున్నారు అమిత్, షాలు మురార్కా దంపతులు. స్పైస్​అప్​ ఫుడ్​ పేరుతో ఒక స్టార్టప్​ పెట్టారు. దాని ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉండే హోమ్​ ఫుడ్​ని తయారుచేసి విదేశాల్లో ఉంటున్న మనవాళ్లకు అమ్ముతున్నారు. 

ఘర్ కా ఖానా” (ఇంటి భోజనం)కు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో వండిన ఫుడ్​ రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైనదని చాలామంది నమ్ముతారు. కానీ.. విదేశాలకు వెళ్లిన చాలామందికి ఇంటి భోజనం దొరకడం కష్టం. మరీ ముఖ్యంగా ఇండియన్​ స్టైల్​ వెజిటేరియన్​ ఫుడ్​ చాలా తక్కువ ప్రాంతాల్లో దొరుకుతుంది. అయితే.. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కోల్​కతాకు చెందిన అమిత్, షాలు మురార్కా దంపతులకు ఎదురైంది. వీళ్లిద్దరికీ ప్రయాణాలు చేయడమంటే ఇష్టం. రెగ్యులర్​గా విదేశాలకు వెళ్తుంటారు. 

అక్కడ మన స్టైల్​ వెజ్​ ఫుడ్​ దొరక్క ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2016లో స్విట్జర్లాండ్‌‌కు వెళ్లినప్పుడు అక్కడ ‘డీహైడ్రేటెడ్’ ఫుడ్​ని చూశారు. వాళ్ల ముందు ఒక వ్యక్తి రెడీ టూ ఈట్ ప్యాకెట్​ని తీసి అందులో కొన్ని వేడి నీళ్లు పోసి తినేశాడు. తర్వాత అమిత్​, షాలు కూడా అలాంటి డీహైడ్రేటెడ్ ఫుడ్​ని టేస్ట్‌‌ చేసి, దానిమీద కొంత రీసెర్చ్​ చేశారు. ప్రిజర్వేటివ్స్​ లేని ఆరోగ్యకరమైన డీహైడ్రేటెడ్​ ఫుడ్​కి ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్​ ఉందని వాళ్లకు అర్థమైంది. అప్పుడే ఇద్దరికీ స్టార్టప్​ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 

ఫ్రీజ్​-డ్రైయింగ్​ 

డీహైడ్రేటెడ్ ఫుడ్ ఎప్పటినుంచో మార్కెట్​లో ఉంది. కానీ.. వీళ్లు అలాంటి సంప్రదాయ పద్ధతిలో కాకుండా ‘ఫ్రీజ్–డ్రైయింగ్’ అనే కొత్త టెక్నిక్​తో ఫుడ్​ని తయారుచేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఫుడ్​ స్ట్రక్చర్​, పోషక విలువలు పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తవానికి ఇది వ్యోమగాములు తినే ఫుడ్‌‌ని నిల్వ చేయడానికి ఉపయోగించే టెక్నిక్. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్నప్పుడు వాళ్లకు పోషకాలు ఎక్కువగా ఉండే భోజనం అందిస్తారు. అందుకోసం ఇలాంటి టెక్నిక్‌‌ని ఉపయోగించి ఫుడ్​ని నిల్వ చేస్తారు. స్పైస్ అప్ ఫుడ్ కూడా ఈ టెక్నాలజీతోనే ‘రెడీ–టు–ఈట్ మీల్స్‌‌’ ప్యాకెట్స్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. “మేము ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదు అనుకున్నాము. అందుకే ఈ టెక్నాలజీని ఎంచుకున్నాం.” అని చెప్పుకొచ్చింది షాలు.  

స్పైస్ అప్ ఫుడ్స్ 

ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రిజర్వేటివ్స్​ లేకుండా అందించడమే లక్ష్యంగా అమిత్​, షాలు కలిసి ‘స్పైస్ అప్ ఫుడ్స్’ అనే బ్రాండ్‌‌ను ప్రారంభించారు. గతంలో అమిత్​ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌‌గా పనిచేసేవాడు. షాలు కుకరీ వర్క్‌‌షాప్‌‌లను నిర్వహించేది. ఒకరికి బిజినెస్​ చేయడం, మరొకరికి ఫుడ్​ గురించి బాగా తెలుసు. వాళ్ల అనుభవాలే ఈ ప్రత్యేకమైన వెంచర్‌‌కు పునాదులు వేయడంలో సాయపడ్డాయి. 

లాభమేంటి?  

రెడీ–టు–ఈట్ మార్కెట్‌‌లో ‘స్పైస్ అప్ ఫుడ్స్‌‌’ను భిన్నంగా నిలిపేది ‘ఫ్రీజ్–డ్రైయింగ్ టెక్నాలజీ’ మాత్రమే. ఈ ప్రక్రియలో తాజా ఇంగ్రెడియంట్స్​తో మీల్స్​ తయారుచేస్తారు. దాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత (–-40 డిగ్రీల సెంటిగ్రేడ్స్​) వద్ద ఫ్రీజ్​ చేస్తారు. దీనివల్ల ఫుడ్​ ఆకారం, రుచిలో మార్పుండదు. ఫుడ్ గడ్డకట్టిన తర్వాత వాక్యూమ్ చాంబర్‌‌లో వేస్తారు. అక్కడ ఫుడ్​లోని ఐస్​ ఘనస్థితి నుండి నేరుగా ఆవిరిగా మారుతుంది. దీనివల్ల ఫుడ్​లోని తేమ తొలగిపోయి, తేలికగా మారుతుంది.

 ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో వేడినీళ్లు పోసుకుని నేరుగా తినేయొచ్చు. కొన్నింటిని మాత్రం కాసేపు ఉడికించి తినాలి. తయారుచేసేటప్పుడు ఫుడ్​ రకాన్ని బట్టి టెంపరేచర్లను అడ్జస్ట్‌‌ చేస్తుంటారు. ఉదాహరణకు... పప్పు లేదా రాజ్మా లాంటి వాటితో పోలిస్తే చట్నీలు చాలా తక్కువ టెంపరేచర్లలో డ్రై చేస్తారు. దీనివల్ల ప్రతి వంటకం తాజాగా వండినప్పుడు ఉండే పోషక విలువలు, రుచిని ఇస్తుంది. సంప్రదాయ డీహైడ్రేషన్ పద్ధతులతో 92 నుంచి 96 శాతం నీటిని తీయొచ్చు. 

కానీ.. ఫ్రీజ్–డ్రై చేయడం వల్ల 99 శాతం కంటే ఎక్కువ నీరు తొలగిపోతుంది. అయితే.. ఈ ప్రాసెస్​ అంతా చేయడానికి వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన మెషీన్ల అవసరం ఏర్పడింది. అందుకోసం ఇద్దరూ కలిసి చైనాలో రకరకాల మెషీన్లను పరిశీలించారు. ఆ తర్వాత ఇండియాలోనే అలాంటి మెషీన్లను తమ అవసరాలకు అనుగుణంగా తయారు చేయించుకున్నారు. అంతటితో పూర్తవ్వలేదు. మెషీన్‌‌లో కీలక భాగాలైన డ్రైయింగ్ చాంబర్, వాక్యూమ్ పంప్, హీట్ సోర్స్, కండెన్సర్, ట్రేలు ఐదు వేర్వేరు సప్లయర్స్​ నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది. 

అందరికీ సర్వీస్​ 

అమిత్, షాలు తమ ప్రొడక్ట్స్‌‌ని అమ్మడమే కాదు.. అమ్మచేతి వంట తినాలి అనుకునే ఎంతోమందికి తమ సర్వీస్​ని అందిస్తున్నారు. కోల్‌‌కతాకు చెందిన ఎంతోమంది విదేశాల్లో ఉంటున్నారు. వాళ్లకోసం కుటుంబీకులు ఫుడ్​ చేసి పంపాలి అనుకుంటారు. అలాంటి వాళ్ల దగ్గర నుంచి ఫుడ్​ని తీసుకుని ఫ్రీజ్–డ్రై చేసి ప్యాక్ చేస్తారు. తర్వాత దాన్ని విదేశాల్లో ఉంటున్న వాళ్ల పిల్లలకు పంపిస్తారు.

నాలుగేండ్ల రీసెర్చ్​ 

ఫ్రీజ్–డ్రైయింగ్ టెక్నిక్​లో టెంపరేచర్ల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వాళ్లకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఆ టైంలో వాళ్లు ప్రొడక్ట్స్‌‌ని కేవలం వాళ్ల ప్రాంతంలోనే డెలివరీ చేశారు. 2024 ఏప్రిల్​లో ఎంతోమంది నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తి నమ్మకం కలిగిన తర్వాత దేశవ్యాప్తంగా డెలివరీ చేయడం మొదలుపెట్టారు. ఆర్డర్లు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక వెబ్‌‌సైట్‌‌ను కూడా ప్రారంభించారు.

సొంత వెబ్‌‌సైట్‌‌ని ప్రారంభించినప్పటి నుంచి స్పైస్ అప్ ఫుడ్స్ వేగంగా అభివృద్ధి చెందింది. సంవత్సరం తిరగకుండానే రూ. 30 లక్షల ఆదాయం వచ్చింది. ఇండియాతోపాటు విదేశాల నుంచి  15 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఒక్కరికి సరిపోయే సింగిల్- సర్వింగ్ టబ్​కి రూ. 180 నుండి రూ. 230 వరకు ధరని నిర్ణయించారు. దేశీయ డెలివరీల కోసం బ్లూ డార్ట్‌‌, 
అంతర్జాతీయ డెలివరీల కోసం డీహెచ్​ఎల్​ సర్వీసులను వాడుతున్నారు. 

నేచురల్​ ఇంగ్రెడియెంట్స్​

రెడీ-టు-ఈట్ ఫుడ్ తయరుచేసేందుకు నాణ్యమైన ఇంగ్రెడియెంట్స్​ని మాత్రమే వాడతారు. ఇండియన్​ కిచెన్​లో కనిపించే మామూలు దినుసులతోనే తయారుచేస్తారు. దాల్-చావల్ నుంచి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ వరకు ప్రతీది తయారుచేస్తున్నారు. వాళ్ల ప్రయాణం 2018లో ప్రారంభమైంది. అప్పుడే అమిత్ చెల్లెలు మధు గోయెల్ కూడా ఈ వెంచర్‌‌లో చేరింది. 2020లో స్పైస్ అప్ ఫుడ్స్ నుంచి రెడీ-టు-ఈట్ మీల్స్ చిన్న ప్యాక్​లను ఉత్పత్తి చేశారు. కానీ.. వాటిని మార్కెట్​లోకి తీసుకురాకుండా ముందుగా వాళ్ల కుటుంబసభ్యులు, స్నేహితులకు ఇచ్చారు. వాళ్ల నుంచి ఫీడ్​బ్యాక్​ తీసుకుని తయారీలో లోపాలను సరిచేసుకున్నారు. ఆ తర్వాత మార్కెట్​లోకి తీసుకొచ్చారు. మొదటినుంచి యూనిట్​లో తయారుచేసిన ప్రతి బ్యాచ్​ క్వాలిటీని టెస్ట్‌‌ చేస్తున్నారు. చెడిపోకుండా నెలల తరబడి ఉంటుందని నిర్ధారించుకోవడానికి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. 

ఎంతోమందికి ఉపాధి

స్పైస్ అప్ ఫుడ్స్ సక్సెస్​కు మరో బలమైన కారణం.. అందులో పనిచేసే ఆడవాళ్లు. స్టార్టప్​ పెట్టిన మొదట్లో అమిత్​ ఇంట్లోనే వాళ్ల అమ్మ, షాలు కలిసి వంట చేసేవాళ్లు. కానీ.. ఆర్డర్లు పెరిగిన తర్వాత వాళ్ల కిచెన్​ కెపాసిటీ సరిపోలేదు. అప్పుడు అమిత్​ కొంతమంది ఆడవాళ్లను పనిలో చేర్చుకున్నాడు. వాళ్లంతా తమ ఇండ్లలోనే వంట చేసి పంపుతారు. కాకపోతే.. వాటిలో వాడే ప్రతి ఇంగ్రెడియెంట్​ని ముందుగానే అమిత్​, షాలు చెక్​ చేస్తారు. వాళ్లు ఫుడ్​ వండిన తర్వాత స్టీల్ కంటైనర్లలోకి మార్చి, లీకేజీలు లేకుండా మూతపెట్టి.. ప్రాసెసింగ్ కోసం యూనిట్‌‌కు పంపిస్తారు. ప్రస్తుతం ఇలా పదిమంది హోమ్​కుక్​లు కంపెనీ కోసం పనిచేస్తున్నారు.  

యాభై ఏళ్ల అల్కా వంట మీద ఇష్టంతో వర్క్‌‌షాప్‌‌లకు వెళ్లి మరీ తన స్కిల్స్​ పెంచుకుంది. కానీ... పిల్లల బాధ్యతల వల్ల ఎక్కడా పనిచేయలేకపోయింది. ఇప్పుడు తన కొడుకులు ఉద్యోగాల కోసం బెంగళూరుకు వెళ్లారు. దాంతో ఆమెకు ఖాళీ సమయం దొరకడంతో స్పైస్ అప్ ఫుడ్స్‌‌లో చేరింది. ‘‘వంట పట్ల నాకున్న మక్కువ వల్ల ఇందులో చేరా. దీనివల్ల నాకు ఎంతో సంతృప్తి కలగడమే కాకుండా ఆర్థిక స్వాతంత్ర్యం కూడా దక్కింది. ఎవరినీ డబ్బు అడగకుండానే నా అవసరాలను తీర్చుకోగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది”అంటోంది అల్కా.