Virat Kohli: కాల్చిన చికెన్, ఉడికించిన కూరగాయలు.. కోహ్లీ డైట్ రహస్యాలు బహిర్గతం

Virat Kohli: కాల్చిన చికెన్, ఉడికించిన కూరగాయలు.. కోహ్లీ డైట్ రహస్యాలు బహిర్గతం

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పరుగుల యంత్రమే కాదు, ఫిట్‌నెస్​ ఫ్రీక్ అని కూడా మనందరికి తెలుసు. 35 ఏళ్ల వయసులోనూ యువ క్రికెటర్లకు సవాల్ విసిరే శరీర ధారుడ్యం, మెరుపు వేగం అతనిది. అయితే, ఆ ఫిట్​నెస్ నిలకడగా మెయిన్​టేన్ చేయడం అంత సులువైన పని కాదు. కానీ, విరాట్ మెయిన్​టేన్ చేస్తున్నాడు. అసలు ఈ స్టార్ క్రికెటర్ ఏం తింటాడు? అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఆ రహస్యాలను స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ జతిన్ సప్రూ బయటపెట్టాడు. 

ఇటీవల ది రణవీర్ షో పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జతిన్ సప్రూ.. కోహ్లి తన ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటైన్ చేస్తున్నాడనే దాని గురించి మాట్లాడాడు. అతని ఆహార వివరాలను వెల్లడించాడు. అందుకు ఒక చిన్న సంఘటన వివరించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ కేవలం కాల్చిన చికెన్, ఉడికించిన కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకున్నాడని సప్రూ పంచుకున్నారు. చాలా కాలం క్రితమే తాను రుచి కోసం ఆహారం తినడం మానేశానని భారత మాజీ కెప్టెన్ తనతో చెప్పాడని సప్రూ తెలిపారు  ఫిట్‌నెస్ మీద అతనికున్న నిబద్ధత అలాంటిదని వెల్లడించారు.

అరగంటకోసారి తింటాడు

మరొక చమత్కారమైన రహస్యాన్ని సప్రూ బయటపెట్టాడు. విమాన ప్రయాణాల్లో కోహ్లీ వెంట ఒక పెద్ద బ్యాగ్ ఉంటుందని.. అందులో కాఫీ సెట్, నట్ సెట్, ప్రోటీన్ బార్ సెట్ వంటి నిత్యావసర వస్తువులు ఉంటాయని తెలిపాడు. వాటికోసం సరైన సమయం కేటాయించుకుని అరగంటకోసారి తింటారని చెప్పుకొచ్చాడు. ఇటువంటి అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం అతని నియమావళిలో అత్యంత సవాలుతో కూడుకున్న అంశాలలో ఒకటని సప్రూ నొక్కి చెప్పాడు.