17న పబ్లిక్​ గార్డెన్​లో ప్రజాపాలన దినోత్సవం

17న పబ్లిక్​ గార్డెన్​లో ప్రజాపాలన దినోత్సవం
  • జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పబ్లిక్ గార్డెన్ లో సీఎం రేవంత్​ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఆమె తెలిపారు. ప్రజా పాలన దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై గురువారం సెక్రటేరియెట్​లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని సీఎస్​ నిర్వహించారు. ప్రజా పాలన దినోత్సవం రోజు సీఎం అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

పబ్లిక్ గార్డెన్ లో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి  ప్రసంగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. సభా స్థలంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆహ్వానితుల వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం, శానిటేషన్, పీఏ సిస్టం, భద్రతా తదితర ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.

17న గణేశ్ నిమజ్జనం ఉన్నందున ఈ సమావేశానికి హాజరయ్యే వారికి ట్రాఫిక్ నియంత్రణ, తగు మార్గాలను ముందస్తుగా తెలియజేయాలని పోలీసు అధికారులకు సూచించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోంశాఖ స్పెషల్​ సీఎస్​ రవి గుప్తా ఇతర అధికారులు పాల్గొన్నారు.