ఇవాళ్టి (మార్చ్ 21) నుంచి టెన్త్​ ఎగ్జామ్స్ .. హాజరుకానున్న5 లక్షల మంది స్టూడెంట్స్

ఇవాళ్టి  (మార్చ్ 21) నుంచి టెన్త్​ ఎగ్జామ్స్ .. హాజరుకానున్న5 లక్షల మంది స్టూడెంట్స్
  • ఐదు నిమిషాలు గ్రేస్​ పీరియడ్
  • 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
  • వచ్చే నెల 4న ముగియనున్న పరీక్షలు

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 4 వరకు జరగనున్నాయి. ఇందుకోసం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 11,547 స్కూళ్ల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్స్​ జరుగుతాయి. 

అయితే, కాంపోజిట్ కోర్సులో ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష  మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరగనుండగా.. సైన్స్ సబ్జెక్టులకు ఫిజికల్, బయోలజీ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు రెండు రోజులు ఉంటుంది. ఈ ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ కు  24 పేజీల బుక్ లెట్ ను ఇవ్వనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది. స్టూడెంట్స్ కు సమస్యలు, సందేహాలు ఉంటే  040–23230942 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించింది. 

ఐదు నిమిషాలు గ్రేస్​ పీరియడ్​

ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు తీస్తుండడం, మరి కొంతమంది పరీక్షలు మిస్ అవుతుండడంతో ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్  డిపార్ట్​మెంట్​ ఊరటనిచ్చింది. పరీక్ష నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. అంటే.. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.  ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు దాంతోపాటు పరీక్షా కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.