మహబూబాబాద్ , వెలుగు : ఎస్సీ ఎస్టీ కేసుల్లో అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని,15 రోజుల్లో పరిష్కరించి నివేదిక అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పురోగతిని అడిగి తెలుసుకుని మాట్లాడారు. జిల్లాలో దళితుల భూ సమస్యలపై వారం రోజుల్లో నివేదికను అందించాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.
ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు. భూ సమస్యలు, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జిల్లాలోని యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చదువుపై ఆసక్తి కలిగేందుకు అవగాహ న కల్పించాలని కోరారు. జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీల భూములు కబ్జాలు కాకుండా పరిరక్షించాలని, పరిశ్రమల శాఖ పథకాల అమలు పెండింగ్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడారు. రివ్యూ మీటింగ్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో,రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నునావత్ రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు గుండాల నరసయ్య, కె.సంజీవరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహస్వామి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నర్మద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.