స్టార్టప్ : పశువుల కోసం..ఒక యాప్

స్టార్టప్ : పశువుల కోసం..ఒక యాప్

గేదెలే ఆ కుటుంబానికి ఆధారం. కానీ.. ఆ ఆధారాన్ని అనుకోకుండా కోల్పోయారు. రాత్రికి రాత్రే తమకున్న తొమ్మిది గేదెలు అనారోగ్యంతో చనిపోయాయి. వాటి చావుకు కచ్చితమైన కారణం తెలియకపోవడంతో ఇన్సూరెన్స్‌‌‌‌ కూడా క్లెయిమ్​ కాలేదు. దాంతో..ఆ కుటుంబానికి కన్నీరే మిగిలింది. అయితే.. ఆ ఫ్యామిలీలో చదువుకున్న రైతు ఒకరు ఉన్నారు. అతను తమ పరిస్థితి మరే రైతుకు రాకూడదు అనుకున్నాడు. అందుకని బాగా ఆలోచించి పాడి రైతుల కోసం ఓ స్టార్టప్​ మొదలుపెట్టాడు. నోరు లేని పశువుల బాధలను తీర్చేందుకు వేల మంది డాక్టర్లను అందులో భాగం చేశాడు. దానిద్వారా రైతులను ఆదుకుంటున్నాడు. అతను కూడా సంపాదిస్తున్నాడు. 

మనీష్ ప్రహ్లాద్​ది రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జైపూర్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లో ఉన్న బన్​స్వారా అనే కుగ్రామం. అతని  కుటుంబం గేదెల మీదే ఆధారపడి బతుకుతోంది. ఆ కుటుంబానికి తెలిసింది వాటి ఆలనాపాలనా చూడడం, పాలు అమ్ముకుని బతకడం మాత్రమే. 2019లో ఒక రోజు రాత్రి గేదెలకు మేత వేసి.. ఆ పక్కనే ఉన్న మంచం మీద పడుకున్నాడు మనీష్‌‌‌‌‌‌‌‌. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూస్తే తొమ్మిది గేదెలు కింద పడిపోయి ఉన్నాయి. వాటి దగ్గరకు వెళ్లి తట్టి చూశాడు. 

అప్పటికే వాటిలో కొన్ని చనిపోయాయి. మరికొన్ని కొన ఊపిరితో ఉన్నాయి. అతను చూస్తుండగానే అవికూడా చనిపోయాయి. అసలు అలా ఎందుకు జరిగిందో? అవి ఎందుకు చనిపోయాయో? కూడా అతనికి తెలియలేదు. వాటి చావుకు కారణమేంటో తెలుసుకునేందుకు దగ్గర్లోని వెటర్నరీ డాక్టర్​ దగ్గరకు వెళ్లాడు. కానీ.. అతను కూడా మనీష్​కు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఆ మూగజీవాల చావుకు కచ్చితమైన కారణం తెలియకపోవడంతో ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ కూడా క్లెయిమ్​ కాలేదు. ఇలా పశువులు చనిపోవడం మనీష్​ ఒక్కడికే కాదు గ్రామాల్లో చాలామంది రైతులకి ఎదురయ్యే అనుభవం. 

తాత నుంచి వచ్చిన ఆస్తి

కుటుంబానికి ఆసరాగా ఉన్న గేదెలు చనిపోవడం, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో.. మనీష్​కి గుండె పగిలినంత పనైంది. ఆ గేదెలంటే వాళ్ల కుటుంబానికి చాలా ఎఫెక్షన్​. ఎందుకంటే ఆ పశుసంపద తాత నుంచి వాళ్లకు సంక్రమించిన ఆస్తి. మనీష్‌‌‌‌‌‌‌‌ తాత (తల్లి వాళ్ల నాన్న) పెండ్లి కానుకగా వాళ్ల అమ్మకు ఒక ముర్రా జాతి గేదె ఇచ్చాడు. చనిపోయిన గేదెలన్నీ దాని సంతానమే. అవి చనిపోవడంతో వాళ్లు జీవనోపాధి కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పాడి రకం గేదె ముర్రా అని చెప్తుంటారు. అందుకే రైతులు వాటిని ముద్దుగా ‘బ్లాక్ గోల్డ్’ అని పిలుస్తుంటారు. మిగతా గేదెలతో పోలిస్తే అవి ఎక్కువ పాలు ఇస్తాయి. 

ముర్రా గేదెల మార్కెట్ ధర 3 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. ప్యూర్​ ముర్రా బ్రీడ్​ గేదె ధర 35  నుంచి 40 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. మనీష్​ దగ్గర ఉన్న గేదెలు కూడా అలాంటి క్వాలిటీ బ్రీడ్​ గేదెలే. వాటి ద్వారా బాగానే ఆదాయం వచ్చేది. మనీష్ స్కూల్​ ఫీజు నుంచి అన్ని అవసరాలు ఆ గేదెల పాల డబ్బుతోనే తీర్చింది వాళ్ల అమ్మ. మనీష్​ కుటుంబమే కాదు.. గ్రామాల్లో ఉంటున్న ఎంతోమంది రైతులు గేదెల మీదే ఆధారపడి బతుకుతుంటారు. అలాంటి రైతులు గేదెలు చనిపోతే ఎంతో వేదన అనుభవిస్తారని మనీష్​కు అర్థమైంది. ఆ సమస్యకు కారణం.. పశువులకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడమే అని అర్థమైంది. 

వెటర్నరీ క్లినిక్​లు లేవు

ప్రపంచంలోనే అతి ఎక్కువ పశువులు ఉన్న దేశం ఇండియా. మన దగ్గర దాదాపు 536.76 మిలియన్ల(యాభైమూడు కోట్ల ఆరువందల డెభైఆరు లక్షల) పశువులు ఉన్నాయి. వ్యవసాయం తర్వాత ఎక్కువమంది రైతులు ఈ రంగం మీదే ఆధారపడి బతుకుతున్నారు. అంతేకాదు.. మొత్తం దేశ జీడీపీలో ఈ రంగం వాటా 6.20 శాతం. కానీ.. పశువుల ఆరోగ్య సంరక్షణ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం.

2022 నాటికి దేశం మెత్తం మీద 12,500 కంటే తక్కువ వెటర్నరీ క్లినిక్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. వైద్య సౌకర్యాలు అందక రైతులు తమ విలువైన ఆస్తులుగా భావించే పాడి పశువులను కోల్పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే మనీష్ 2020లో  మరికొందరితో కలిసి ‘‘వెర్డాంట్ (Verdant) ఇంపాక్ట్”  అనే స్టార్టప్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. దాని ద్వారా టెలీమెడిసిన్ సౌకర్యాలు, యానిమల్​ ఐసీయూ, రిమోట్ మానిటరింగ్, పశువుల సంరక్షణ కోసం వర్చువల్ వెటర్నరీ కన్సల్టేషన్‌‌‌‌‌‌‌‌ లాంటి సేవలు తీసుకొచ్చాడు. 

వన్ స్టాప్ సొల్యూషన్​

వాస్తవానికి మనీష్ ఒక రైతు మాత్రమే కాదు. పీహెచ్​డీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కూడా. అయితే ఈ స్టార్టప్​ కోసం చదువుకి మధ్యలోనే ఫుల్​స్టాప్​ పెట్టాడు. స్టార్టప్‌‌‌‌‌‌‌‌ పెట్టాక కూడా అతనికి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటినీ అధిగమించి సక్సెస్​ అయ్యాడు. “పిల్లులు, కుక్కల్లాంటి వాటినైతే.. ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్లొచ్చు. అందుకే వాటికి చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్​కు తీసుకెళ్తుంటారు. 

కానీ.. గేదెలను తీసుకెళ్లాలంటే రవాణా ఖర్చులు ఎక్కువ. పైగా అందుకోసం చాలా శ్రమ పడాలి. అందుకే  రైతులు వాటిని సరైన టైంకి ఆసుపత్రులకు తీసుకెళ్లలేకపోతున్నారు. అందుకనే ‘టెలీమెడిసిన్’ మొదలుపెట్టాం. దీనిద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా డాక్టర్లతో మాట్లాడొచ్చు. అంతేకాదు.. అవసరమైతే డాక్టర్​ ఇంటికొచ్చి ట్రీట్​మెంట్ చేస్తాడు. దీనివల్ల రైతులకు చాలా ఖర్చులు తగ్గుతాయి” అంటున్నాడు మనీష్​.

పరిష్కారం కోసం అప్లికేషన్​

పశువులకు సాధారణంగా.. పాదం, నోటికి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో జీర్ణ సమస్యలు, జ్వరం, చర్మంపై గడ్డలు ఏర్పడడం(లంపీ స్కిన్​ డిసీజ్​), పోషకాహారం అందకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వ్యాధులను వెంటనే గుర్తించి.. వాటికి పరిష్కారాలు తెలుసుకునేందుకు​ ఒక మొబైల్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ తెచ్చాడు మనీష్. ఈ యాప్​లో పశువుల ఫొటోలు, వీడియోలు అప్​లోడ్​ చేయొచ్చు. వాటిని పరిశీలించిన డాక్టర్లు.. ప్రిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌, రెమిడీస్​ని రైతులకు షేర్​ చేస్తారు. పశువు మరీ అనారోగ్యంగా ఉంటే.. వెంటనే డాక్టర్లను కాంటాక్ట్​ చేయడానికి ప్రత్యేక వెసులుబాటు కూడా ఉంది. 

యాప్​లో ఉండే.. ‘SOS’ బటన్‌‌‌‌‌‌‌‌ని నొక్కితే.. వెర్డాంట్​​తో కనెక్ట్‌‌‌‌‌‌‌‌ అయిన డాక్టర్ల కన్సల్టేషన్​ తీసుకోవచ్చు. ‘ఓలా, ఉబెర్​’ యాప్స్​లో ట్యాక్సీలు బుక్ చేసుకున్నంత ఈజీగా డాక్టర్ల కన్సల్టేషన్​ బుక్ చేసుకోవచ్చు. డాక్టర్లు ఉండే ప్రాంతం నుంచి 40 కిలోమీటర్ల పరిధి వరకు సేవలందిస్తారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఓఎస్​ నొక్కిన గంటలోపే డాక్టర్​ లొకేషన్​కు వెళ్లిపోతాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. 

చాలా ప్రాంతాల్లో...

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ యాప్​ ద్వారా సర్వీసులు అందిస్తున్నారు. పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్​, త్రిపుర, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో10,000 కంటే ఎక్కువ టెలీమెడిసిన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.1,700 మందికి పైగా వెటర్నేరియన్స్‌‌‌‌‌‌‌‌, పారా వెటర్నేరియన్స్​ పనిచేస్తున్నారు. 

రోజుకు దాదాపుగా2,500 టెలీమెడికల్ కన్సల్టెన్సీ కాల్స్​  వస్తున్నాయి. ఎక్స్​పర్ట్స్‌‌‌‌‌‌‌‌ కన్సల్టేషన్​కు 90 రూపాయలు. ఫీల్డ్ విజిట్‌‌‌‌‌‌‌‌కు మాత్రం150 రూపాయలు ఛార్జ్​ చేస్తారు. మామూలుగా డాక్టర్​ విజిట్​ చేస్తే మార్కెట్​లో 300 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తుంటారు అన్నాడు మనీష్. అంతేకాదు.. పశువుల ఆరోగ్యం, లొకేషన్​ మానిటర్​ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్​ఎఫ్​ఐడీ) ట్యాగ్స్​ కూడా తీసుకొచ్చారు. ఈ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా ప్రిస్క్రిప్షన్​, డిసీజ్​ హిస్టరీ లాంటివి కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి వెర్డాంట్ ఇంపాక్ట్ సేవలను ఆరు లక్షల మందికి పైగా రైతులు వాడుకుంటున్నారు.  

హెర్బల్​ ట్రీట్​మెంట్​

పాడి రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో పశువుల్లో గర్భధారణ జరగకపోవడం ఒకటి. దానికి ప్రధానమైన కారణం పోషకాహార లోపం. ఈ సమస్య ఉన్న గేదెలు చాలా ఆలస్యంగా గర్భం దాల్చుతాయి. అందుకే పశువుల్లో ఓవ్యులేషన్​ పీరియడ్​ని పెంచేందుకు హెర్బల్​ ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. సాధారణంగా పోషకాహార లోపం ఉంటే 37 నుండి 40 నెలల్లో గర్భం దాల్చుతాయి. మంచి పోషకాహారాన్ని అందిస్తే.. 22 నుండి 27 నెలల్లో గర్భం దాల్చడానికి రెడీగా ఉంటాయి. అంటే.. గేదెలు పాలు ఇవ్వడం మానేయగానే గర్భధారణ జరుగుతుంది. దీనివల్ల రైతులకు జాతిని బట్టి ఏటా రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ స్టార్టప్​కు పశువైద్యంతోపాటు జెనెటిక్​ కేర్​, హెల్త్​ సప్లిమెంట్ల అమ్మకాల ద్వారా కూడా ఆదాయం వస్తోంది. ప్రస్తుతం వెర్డాంట్​ స్టార్టప్​ వార్షికాదాయం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు.

సంతృప్తినిస్తోంది

“లాభాలతో పాటు ఈ పని నాకు చాలా సంతృప్తినిస్తోంది. తెలియని కారణాలతో పశువులు చనిపోవడం వల్ల చాలామంది రైతులు ఇన్సూరెన్స్​ క్లెయిమ్‌‌‌‌ చేసుకోలేకపోతున్నారు. మా స్టార్టప్ వల్ల అలా ఇబ్బందులు పడే ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతు కుటుంబాల ఆదాయాన్ని 40 శాతం పెంచగలిగాం. ఎంతోమంది గేదెలు అమ్మి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయిస్తున్నారు. లక్షలాది నోరు లేని జీవులు, రైతు కుటుంబాల కోసం పనిచేయడం నాకు  చాలా సంతోషాన్ని ఇస్తోంది”అంటాడు మనీష్.