- భవిష్యత్తు కరెంట్ అవసరాలు తీర్చేలా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ
- 33 శాతం కాలుష్యం తగ్గించే దిశగా సర్కారు ప్రయత్నాలు
- గ్రీన్ ఎనర్జీకి భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు
- రాష్ట్రంలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులు
- 1.14 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించి భవిష్యత్తు అవసరాలకు సరిపడే కరెంటును ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’ను రూపొందించింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త పాలసీని ఆమోదించింది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. కొత్త పాలసీతో రాబోయే పదేండ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు 1.14 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ పాలసీ అమలుతో రాష్ట్రంలో ఇప్పుడున్న కాలుష్య తీవ్రత పదేండ్లలో 33 శాతం తగ్గుతుందని భావిస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్ తదితర అభివృద్ధి పనులతో భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరగనున్నది. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉండగా, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నది. భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం పెంచుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.
సోలార్ తోపాటు ఫ్లోటింగ్ సోలార్, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు పాలసీ రూపొందించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతోపాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను ఈ పాలసీలో పొందుపర్చింది.
కొత్త పాలసీతో ప్రయోజనాలు ఇవే..
రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఏడాదిలో 300 రోజులు సోలార్ పవర్ జనరేషన్ కు అనుకూలం. బలమైన గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో విండ్ పవర్ జనరేషన్‌కు మంచి చాన్స్ ఉన్నది. అదే విధంగా కొత్త విధానం ప్రకారం సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాలను స్థాపించేందుకు ముందుకు వచ్చే డెవలపర్లను ప్రోత్సహిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ స్థలాల్లో కొత్త ప్లాంట్లకు అనుమతులు ఇస్తారు.
వీటికి ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇవ్వనున్నారు. సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న సంస్థలు.. డిస్కమ్‌లకు, ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా కరెంట్ ను విక్రయించుకునే అవకాశాన్ని కల్పించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ కింద ప్రభుత్వం ప్రోత్సహించనున్నది. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు.
ప్లాంట్ల ఏర్పాటుకు వేగంగా అనుమతులు
టీజీ-ఐపాస్ ద్వారా అన్ని రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తారు. ప్లాంట్ల స్థాపనకు కొనుగోలు చేసిన భూములకు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు, ఎన్వోసీలను మినహాయించారు. సోలార్ ప్లాంట్లకు నీటి చార్జీలను రీయింబర్స్ చేస్తారు. సోలార్, పవన విద్యుత్తును వినియోగించే ఎంఎస్ఎంఈ సంస్థలకు 8 ఏండ్లపాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మాఫీ వర్తిస్తుంది. మూలధన పెట్టుబడిలోనూ రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. పునరుత్పాదక విద్యుత్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు వినూత్న ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌కో లేదా డిస్కంల అధ్వర్యంలో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది.
మహిళా సంఘాలకు అవకాశం
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఇస్తుంది. డిస్కమ్‌లు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్లను ప్రోత్సహిస్తారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, ఇతర పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. సీలింగ్ పరిమితి ఉండదు. భూ వినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు.