- బీఆర్ఎస్ నుంచి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు
- మూడు కమిషన్లకు కూడా చైర్మన్ల నియామకం
- విద్యకు ఆకునూరి, బీసీకి నిరంజన్, రైతుకు కోదండరెడ్డి దాదాపు ఖరారు
- భట్టి, ఉత్తమ్‌తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. మరో 15 నుంచి 20 కార్పొరేషన్ చైర్మన్ ల నియామకంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలిసింది. మూడు కమిషన్లకు కూడా చైర్మన్, సభ్యులను నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే వీటిని భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడుతాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ నుంచి అనుమతి తీసుకున్న సీఎం రేవంత్.. ఇటీవల సెక్రటేరియెట్ లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ అయిన సందర్భంలో వీటిపై చర్చించి ముగ్గురు కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
బుధవారం సీఎం నివాసంలో రేవంత్ తో భట్టి భేటీ అయిన సందర్భంలో కూడా ఈ నియామకాలపై చర్చ జరిగినట్టు సమాచారం. దాదాపు రెండు నెలల కిందట 35 ప్రభుత్వ సంస్థల కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన కార్పొరేషన్లకూ త్వరలోనే చైర్మన్ లను నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో కీలకమైన ఆర్టీసీ, సివిల్ సప్లై, మూసీ రివర్ ప్రాజెక్టు కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరికే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది.
మిగతా ఎమ్మెల్యేలకు ఎలాంటి పదవీ రాలేదు. అయితే, ఇందులో ఓ ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం కీలకమైన కార్పొరేషన్ పదవులు ఇస్తామని సీఎం రేవంత్ చేరికల సందర్భంలో హామీ ఇచ్చారని, దాని ప్రకారమే ఇప్పుడు ఆర్టీసీ, సివిల్ సప్లై, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వాటిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక మిగిలిన కార్పొరేషన్ల చైర్మన్ పదవులు మాత్రం పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు ఇవ్వనున్నారు.
మూడు కమిషన్లకు చైర్మన్లు
గత నెల 31తో బీసీ కమిషన్ పదవీ కాలం ముగియడంతో త్వరలోనే దీనికి చైర్మన్ తో పాటు సభ్యులను నియమించి కుల గణనను చేపట్టనున్నారు. ఈ కమిషన్ కు చైర్మన్ గా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ను నియమించనున్నట్టు గాంధీ భవన్లో ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం విద్య కమిషన్ ను ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించనున్నట్టు సమాచారం. అలాగే, రైతు కమిషన్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిని నియమించనున్నారని కాంగ్రెస్ లో ప్రచారం సాగుతోంది.