ఎక్స్ గ్రేషియా రావట్లే.. సమస్యలు తీరట్లే..

ఎక్స్ గ్రేషియా రావట్లే.. సమస్యలు తీరట్లే..
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​కు వినతుల వెల్లువ
  • సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్, అధికారులకు ఆదేశం
  • ఫాల్స్​ కేసులు నమోదు కాకుండా చూడాలని సూచన

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​కు పలువురు బాధితులు సమస్యలు విన్నవించారు. చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్​చైర్మన్​జక్కి వెంకటయ్య అధ్యక్షతన శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్ ​నిర్వహించారు. 

కమిషన్​సభ్యులతోపాటు కలెక్టర్​ కుమార్​దీపక్, డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా ఫారెస్ట్​ఆఫీసర్​ శివ్ ఆశిష్ సింగ్ పాల్గొన్నారు. కమిషన్​ చైర్మన్​ వెంకటయ్య ఎస్సీ, ఎస్టీ కేసులు, భూ సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను చైర్మన్​కు విన్నవించారు. 

దాడి చేసిన వ్యక్తిని కేసు నుంచి తప్పించారు 

బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన ఎర్ర లావణ్య కుటుంబసభ్యులపై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా నిరుడు జూలై 4న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​ బుక్​ అయిన వెంటనే చెల్లించాల్సిన ఎక్స్​గ్రేషియా డబ్బులు ఇంతవరకు రాలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

తనపై దాడికి పాల్పడిన ఓ వ్యక్తి ఎస్సీ కావడంతో పోలీసులు అతడిని కేసు నుంచి తొలగించడం అన్యాయమని వాపోయింది. నిందితుడిపై వెంటనే క్రిమినల్​ కేసు ఫైల్​ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లిని ఏసీపీ రవికుమార్​ను చైర్మన్​ ఆదేశించారు. లావణ్యకు రెండు రోజుల్లో ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కలెక్టర్​కు సూచించారు. 

సింగరేణి పరిహారం ఇయ్యట్లే..

జైపూర్​ మండలం గుత్తదార్​పల్లిలోని భూములతో పాటు ఇండ్లను శ్రీరాంపూర్​ఓపెన్ ​కాస్ట్​ ప్రాజెక్టు కోసం సింగరేణి సంస్థ తీసుకుంది. వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించిన అధికారులు ఇండ్ల అడుగు జాగలకు మాత్రం డబ్బులు ఇవ్వకుండానే ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని భూనిర్వాసితులు వాపోయారు. 2008లో అవార్డు పాస్ ​చేసినా నేటికీ తమ గోడు పట్టించుకోవడం లేదని రేగుంట చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. వీరికి త్వరలోనే పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషన్​ చైర్మన్​కు కలెక్టర్​ వివరించారు. 

రెవెన్యూ భూములను ఫారెస్టోళ్లు గుంజుకున్నరు

వేమనపల్లి మండలం బుయ్యారం శివారు 66 సర్వేనంబర్​లోని భూములను గ్రామానికి చెందిన 18 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 40 ఏండ్లుగా సాగుచేసుకుంటున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ​సర్కారు పట్టాలు ఇచ్చిందని, బీఆర్​ఎస్ ​హయాంలో ధరణి పాస్​బుక్​లు కూడా ఇచ్చారని, వాటిపై బ్యాంకుల్లో క్రాప్​లోన్లు కూడా తీసుకున్నామని చెప్పారు. 

20 ఏండ్ల క్రితం రెవెన్యూ, ఫారెస్ట్​ జాయింట్​సర్వేలో రెవెన్యూ భూములుగా నిర్దారించారన్నారు. కానీ మూడేండ్ల నుంచి ఫారెస్టు అధికారులు పంటలు సాగు చేసుకోనివ్వడం లేదన్నారు. మరోసారి జాయింట్​సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించాలని చైర్మన్​వెంకటయ్య డీఎఫ్​వోకు సూచించారు.

పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయట్లే..

మంచిర్యాల సాయికుంటలోని గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్​ ఇన్​చార్జి ప్రిన్సిపాల్​ నైతం శ్రీనివాస్​పై మంచిర్యాల పోలీస్​ స్టేషన్​లో పోక్సో కేసు నమోదైనప్పటికీ ఆయనను అరెస్టు చేయడం లేదని ఏఐఎస్ఎఫ్​లీడర్​ సన్నీగౌడ్ తెలిపారు. నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వెంకటయ్య ఆదేశించారు. ఎగ్జామ్స్​ పూర్తికాగానే ప్రిన్సిపాల్​ను అక్కడినుంచి తొలగిస్తామని కలెక్టర్​ తెలిపారు. 

అట్రాసిటీ, ల్యాండ్​ కేసుల పరిష్కారానికి డెడ్​లైన్

పెండింగ్​లో ఉన్న అట్రాసిటీ కేసులను మే నెలాఖరులోగా, ల్యాండ్​ కేసులను ఏప్రిల్​లోగా పరిష్కరించడానికి అధికారులు స్పెషల్ ​డ్రైవ్​ నిర్వహించాలని చైర్మన్​ ఆదేశించారు. 2019 నుంచి పెండింగ్​లో ఉన్న ఓ కేసు విషయంలో పోలీసు తీరును ప్రశ్నించారు. ఫాల్స్​కేసులు నమోదు కాకుండా చూడాలని, కన్విక్షన్​ పర్సెంటేజ్​ పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఏడాది యాక్షన్​ ప్లాన్​ తయారు చేసుకొని ప్రతినెలాఖరున గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలని, చట్టాలు, ప్రభుత్వ పథకాలపై ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధిహామీ పనుల్లో ఎస్సీ, ఎస్టీ కూలీల సంఖ్య పెంచి వంద రోజులు పని కల్పించాలన్నారు. మంచిర్యాల, సిద్దిపేటలో ఎస్సీ, ఎస్టీ కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. 

సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే చర్యలు

ఆసిఫాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని , పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అధికారులను హెచ్చరించారు. ఆసిఫాబాద్​ కలెక్టరేట్ లో కమిషన్ సభ్యులు, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా ఇతర అధికారులతో కలిసి ఆర్ ఓఆర్, అట్రాసిసీ, భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీలకు కల్పించే ప్రయోజనాలపై జిల్లా అధికారులతో, కమిటీ సభ్యులతో రివ్యూ నిర్వహించారు. 

పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో సివిల్ రైడ్ డే తప్పనిసరిగా నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు, పథకాల అమలు, మంచినీటి సౌకర్యం తదితర అంశాలపై చర్చించి సూచనలు, సలహాలు చేశారు.