వాస్తవాలు తెలుసుకోకుండా..ఎస్పీపై నోరు జారొద్దు

వాస్తవాలు తెలుసుకోకుండా..ఎస్పీపై నోరు జారొద్దు

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఎస్పీ, -బీఎస్పీ పార్టీలు ములాయం సింగ్ యాదవ్, కాన్షీరాంల నాయకత్వంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం సాధించి ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పును తీసుకు వచ్చాయి. దేశంలో నూతన చైతన్యంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళల పురోగమిశక్తుల చైతన్యానికి నాంది పలికాయి. ములాయం- కాన్షీరాంల కలయికతో రెండు పార్టీలు సామాజిక న్యాయ సిద్ధాంత పునాదులపై పనిచేస్తూ..1993 నుంచి1995 వరకు అధికారంలో కొనసాగాయి. జరిగిన వాస్తవాలను పూర్తిగా తెలుసుకోని కొందరు నేటి తరం తెలంగాణ బీఎస్పీ నాయకులు ఎస్పీ కార్యకర్తలను గూండాలని సంబోధించడం ఆక్షేపణీయం. ఆ వాఖ్యలను ఎస్పీ ఖండిస్తున్నది. 

1995లో బీఎస్పీ ఎస్పీతో అలయన్స్‎ను బ్రేక్ చేస్తూ బీజేపీ వైపు వెళ్లింది. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా బీఎస్పీ బీజేపీ వైపు వెళ్లడాన్ని సమాజ్‎వాదీ కార్యకర్తలు సహజంగానే ప్రశ్నించారు. దానికి ప్రభుత్వ గెస్ట్ హౌస్‎లో ఉన్న మాయావతి, వారి పార్టీ నాయకత్వంపై ఎస్పీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా సమాజ్‎వాదీ పార్టీపై ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మరొకసారి ఎస్పీ, -బీఎస్పీ కలిసి 2019 జనరల్ ఎలక్షన్‎లో పోటీ చేశాయి. బీఎస్పీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని దాంతోనే తేలిపోయింది. 

కుల గణన కోసం ఉద్యమిస్తున్నది

అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ ఒక అడుగు ముందుకేసి కాన్షీరాం విగ్రహావిష్కరణ చేసి మహనీయుల ఆదర్శాలతో ముందుకు సాగుతున్నది.  దేశంలో 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు, అధికారం, అవకాశాలు లేకుండా ఉన్న దశలో సమాజ్‎వాదీ ఉద్యమం ‘పిచ్డే పావే సౌమే సాట్’ స్లోగన్‎తో వారి ఉనికిని చాటింది. బీసీల గుర్తింపు నిరాకరించిన కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకిస్తూ 1987లో ములాయం‎ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‎లో క్రాంతి రథయాత్రను చేపట్టారు. అందులో భాగంగా ఏర్పడ్డ జనతాదళ్ ప్రభుత్వం బీసీలను గుర్తిస్తూ 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇది ముమ్మాటికీ సమాజ్‎వాదీ శక్తుల విజయమే. అదే స్ఫూర్తితో నేడు కుల జనగణన కోసం సమాజ్‎వాదీ పార్టీ దేశస్థాయిలో ఉద్యమిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అడ్డుకునే బీజేపీపై ముమ్మర పోరాటం చేస్తున్నది అఖిలేష్ యాదవ్  నాయకత్వంలోని సమాజ్‎వాదీ పార్టీ. సమానత్వం, సంపద సృష్టి, సామాజిక మార్పు కోసం ముందుకు నడుస్తున్న పార్టీ ఎస్పీ మాత్రమే. వెనుకబడిన కులాలకు, వర్గాలకు రాజ్యాధికారం అందించేది సమాజ్‎వాదీ ఉద్యమమే. బీసీలకు అండగా నిలుస్తూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నది.  జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి, బీజేపీ ముక్త్ భారత్ కోసం కృషి చేస్తున్నది. ఎన్నో గొప్ప ఆదర్శాలతో సామాజిక విప్లవం కోసం పోరాడుతున్న సమాజ్‎వాదీ పార్టీని కించపరచడం సామాజిక శక్తులను అవమానించడమే అవుతుంది. ప్రజాస్వామిక పోరాట శక్తులు సమాజ్​వాది పార్టీ ఉద్యమాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉన్నది.

కాన్షీరాంను గెలిపించిన ఘనత ఎస్పీదే

మెయిన్‎పురి సభలో మాయావతి సమక్షంలో ములాయం సింగ్ యాదవ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాయావతిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి’ అని ఎస్పీ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు. సమాజ్‎వాదీ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చిన ఆ నిర్దేశంలో భాగంగా మాయావతి ని ఎస్పీ నాయకత్వం, క్యేడర్​ ఎప్పుడూ గౌరవిస్తూనే ముందుకు పోతోంది. ఈ సందర్భంగా ఎస్పీ, -బీఎస్పీ కలిసి ఉద్యమించిన సమయంలో కొన్ని ఘటనలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1991లో మొదటిసారి మెయిన్ పురి నుంచి లోక్‎సభకు పోటీ చేసిన కాన్షీరామ్ ను గెలిపించడంలో ములాయం సింగ్ యాదవ్, సమాజ్​వాది పార్టీ పాత్ర ఎంతో గణనీయమైనది. 1993 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు 105 ఎమ్మెల్యేలతో జనతాదళ్ సమాజ్‎వాదీ పార్టీతో పొత్తును కోరినప్పటికీ తిరస్కరించడం వాస్తవం.  సమాజ్‎వాదీ పార్టీ 13 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ శక్తులను ఏకం చేస్తూ దేశంలో సమాజ్‎వాదీ పార్టీ ఆదర్శంగా నిలిచి యూపీలో అధికారం సాధించింది. సోషలిస్ట్ ఉద్యమంలో భాగంగా జాతి తోడో ఆందోళన్‎ను సిద్ధాంతపరంగా సమాజ్‎వాదీ పార్టీ కొనసాగించడమే దీనికి కారణం. ‘మిలే ములాయం కాన్షీరాం’ అనే స్లోగన్ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసింది. సమాజ్‎వాదీ పార్టీ అంబేద్కర్, లోహియాల సిద్ధాంతంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, పేదలు, మహిళలను ఏకం చేస్తూ ఉద్యమిస్తున్నది.

- ప్రొ. ఎస్. సింహాద్రి రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్​వాదీ పార్టీ, తెలంగాణ