విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి

ఆసిఫాబాద్, వెలుగు: గిరిజన బాలికల ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై ఆసిఫా బాద్ లోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న త్రిష, సాయికీర్తనను ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవితో కలిసి బుధవారం పరామర్శించారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం హాస్టల్ ను విజిట్ చేసి వంటలను పరిశీలించారు. హాస్టల్ లో జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ 

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం రాత్రి అడిషనల్ కలె క్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మ్యాక్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ ట్రీట్​మెంట్ పొందుతున్న ఐదుగురు విద్యార్థుల ఆరోగ్యం కుదుటపడడంతో బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.