తెలంగాణ కిచెన్ : వెరైటీ స్టీమ్డ్​ స్నాక్స్

 తెలంగాణ కిచెన్ : వెరైటీ స్టీమ్డ్​ స్నాక్స్

శ్నాక్స్ అంటేనే నూనెలో బాగా వేగించినవి అనుకుంటారు. అనుకోవడం ఏంటి? నోటికి రుచించేవి అవే కదా అంటారు కూడా. అది సరే కానీ, అలాంటి శ్నాక్స్​ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి నూనెలో వేగించడానికి బదులు ఆవిరి మీద ఉడికించి చూడండి. రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం... మరింకెందుకాలస్యం ఇక్కడ ఇచ్చిన వెరైటీ స్టీమ్డ్​ శ్నాక్స్​ ట్రై చేయండి.

ఫర్రా

కావాల్సినవి :

బియ్యప్పిండి, నీళ్లు - ఒక్కో కప్పు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు, నూనె - సరిపడా
శనగపప్పు, మినప్పప్పు - ఒక్కోటి అరకప్పు
పచ్చిమిర్చి - మూడు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు 
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, ఆవాలు - ఒక్కో టీస్పూన్
పసుపు, కారం - ఒక్కోటి అర టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
కొత్తిమీర - ఒకటిన్నర టేబుల్ స్పూన్

తయారీ : శనగపప్పు, మినప్పప్పును ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు పోయాలి. అందులో ఒక టీస్పూన్ నెయ్యి, ఉప్పు వేయాలి. ఆ నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ పిండిని ఒక పెద్ద ప్లేట్​లో వేసి మెత్తగా మెదపాలి. పైన కాటన్ క్లాత్ కప్పి కాసేపు పక్కన పెట్టి ఉంచాలి.మిక్సీజార్​లో నానబెట్టిన శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్​ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో గరం మసాలా, పసుపు, ఇంగువ, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. రెడీ చేసిపెట్టుకున్న పిండిని పూరీకంటే చిన్న సైజులో వత్తాలి. అందులో రెడీ చేసిన స్టఫింగ్​పెట్టి సగానికి మడతపెడితే ఉడికించేందుకు ఫర్రాలు రెడీ. ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి దానిపై రంధ్రాలుండే గిన్నె పెట్టాలి. దానిమీద ఫర్రాలను ఉంచి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత వాటిని రెండుగా కట్ చేయాలి. నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, కొత్తిమీర వేగించాలి. అందులోనే ఉడికించిన ఫరాలను కూడా వేసి కలపాలి. ఈవెనింగ్​ శ్నాక్​లా తింటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.

వెజ్​ కరాంజి

కావాల్సినవి :

నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు - ఒక్కో టీస్పూన్ చొప్పున
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకు - కొంచెం
ఉల్లిగడ్డ, క్యారెట్(తరిగి)​ - ఒకటి
క్యాబేజీ తురుము - అర కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
ఉప్పు - సరిపడా
పసుపు - అర టీస్పూన్
కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అందులో క్యారెట్, క్యాబేజీ తురుము వేయాలి. అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగేటప్పుడు బియ్యప్పిండి, పసుపు వేసి కలపాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసి పిండి ముద్దలా కలపాలి. ఆ మిశ్రమాన్ని కజ్జికాయలు వత్తే మౌల్డ్​లో పెట్టి ప్రెస్​ చేయాలి. వాటిని ఆవిరి మీద ఉడికించి కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

రవ్వ ఖట్టా

కావాల్సినవి :

బొంబాయి రవ్వ - ఒకటిన్నర కప్పు
పసుపు, మిరియాల పొడి - ఒక్కోటి అర టీస్పూన్
ఉప్పు - ఒక టీస్పూన్
పాలకూర, పెరుగు, కాలీ ఫ్లవర్ (ఉడికించి) - ఒక్కోటి అర కప్పు
నీళ్లు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
నూనె - ఒక టేబుల్ స్పూన్
ఆవాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్
జీలకర్ర, పసుపు, కారం, గరం మసాలా - ఒక్కోటి అర టీస్పూన్
క్యారెట్, క్యాప్సికం, మీల్​మేకర్ (తరిగి) - పావు కప్పు
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
ఆలుగడ్డ (ఉడికించి) - ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు - రెండు టేబుల్ స్పూన్లు
చిల్లీ ఫ్లేక్స్ - ఒక టీస్పూన్
కొబ్బరి పొడి - అర కప్పు

తయారీ : ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, ఉప్పు, పెరుగు, పసుపు, మిరియాల పొడి వేసి నీళ్లు పోసి బాగా కలిపి ముద్ద చేయాలి. గిన్నె మీద మూతపెట్టి పావుగంట పక్కన పెట్టాలి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేగించాలి. అందులో క్యారెట్, క్యాప్సికం, మీల్​మేకర్ తరుగు వేసి కలపాలి. తరువాత పసుపు, జీలకర్ర, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేయాలి.  ఒక్కో ఉండను చేతిలో పెట్టుకుని చిన్న చపాతీలా వత్తాలి. మధ్యలో వెజిటబుల్ స్టఫింగ్​ పెట్టి మళ్లీ ఉండ చేయాలి. ఈ ఉండల్ని ఆవిరి మీద పావుగంటసేపు ఉడికించాలి. నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పాటు చిల్లీ ఫ్లేక్స్, జీడిపప్పు తరుగు, కొబ్బరి పొడి వేసి వేగించాలి. ఆ తాలింపులో ఉడికించిన ఉండల్ని వేసి కలపాలి. గోల్​ గోల్​ రవ్వ ఖట్టా తింటుంటే ఇంకా కావాలనిపిస్తుంది. 

కప్​ కేక్స్

కావాల్సినవి :

బొంబాయి రవ్వ, బియ్యప్పిండి - ఒక్కో కప్పు
పాలు - రెండు కప్పులు
ఉప్పు, నూనె - సరిపడా
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
మిల్క్ పౌడర్ - రెండు టేబుల్ స్పూన్లు
ఈనో - ఒక ప్యాకెట్
బెల్లం తురుము, ఎండు కొబ్బరి (వేగించి) - ఒక్కోటి అర కప్పు

తయారీ : బొంబాయి రవ్వ, ఉప్పు, నెయ్యి ఒక గిన్నెలో వేసి అందులో పాలు పోసి బాగా కలపాలి. తరువాత  మిల్క్​ పౌడర్, ఈనో వేసి మళ్లీ ఒకసారి బాగా కలపాలి. ఆ మిశ్రమంపై మూతపెట్టి పావుగంట నానబెట్టాలి. ఈలోపు సెరామిక్​ కప్​లకి నూనె పూయాలి. పావుగంట అయ్యాక ఆ కప్పుల్లో రెడీ చేసిన పిండి ఒక గరిటె వేయాలి. దానిపై కొబ్బరి పొడి, బెల్లం పొడి చల్లాలి. పైనుంచి మళ్లీ ఒకసారి  ఇంకో గరిటె పిండి వేసి పైనుంచి బెల్లం తురుము చల్లాలి.  ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. దానిపై రంధ్రాలు ఉండే ప్లేట్​ పెట్టాలి. పైన బటర్ పేపర్​ పరవాలి. దానిమీద పిండి నింపిన కప్పులను వరుసగా పేర్చాలి. మూతపెట్టి పది నిమిషాలు ఉడికిస్తే యమ్మీ కప్​ కేక్స్​ రెడీ.