హైదరాబాద్: కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పిన్నాపురం జల విద్యుత్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరతూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం లేఖ రాసింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ లేఖ పంపారు. బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టరాదని ఆయన పేర్కొన్నారు. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని కోరారు. తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొత్త ప్రాజెక్టులతోపాటు.. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతుల్లేవని స్పష్టం చేశారు. తాము రాస్తున్న లేఖలోని అంశాలను కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ మురళీధర్ కోరారు.