- వనపర్తిలో ఎనిమల్ కేర్ సెంటర్ ఏజెన్సీకి బాధ్యతలు
వనపర్తి, వెలుగు: గ్రామం, పట్టణమని కాకుండా జిల్లాల్లో వీధి కుక్కల బెడద కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కుక్కల సమస్య తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుంది. దీంతో పాటు ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కుక్కల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులోభాగంగా మున్సిపాలిటీలు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. వనపర్తి జిల్లాలో ఈ నెల 8 నుంచి కుక్కల జననాన్ని కంట్రోల్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంట్రోల్ సెంటర్ను జిల్లా కేంద్రం శివారులోని నాగారం ఊరగుట్ట వద్ద ఏర్పాటు చేశారు.
ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు..
ఎనిమల్ కేర్ సెంటర్ ఏజెన్సీకి జిల్లాలో కుక్కల బర్త్ కంట్రోల్ బాధ్యతను అప్పగించారు. ఆపరేషన్లు చేసేందుకు ఏజెన్సీకి అన్ని సౌలతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు రోజుకు కనీసం పది కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆపరేషన్లు ప్రారంభించారు.
పట్టుకొచ్చిన కుక్కల కోసం స్పెషల్ బోనును ఏర్పాటు చేశారు. తెచ్చిన కుక్కలను ఒక రోజంతా బోనులో ఉంచి గమనిస్తారు. ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాక, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తరువాత వారం రోజులు సెంటర్లోనే ఉంచుకుని వాటి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు. నట్టల నివారణ మందులు, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తదితర ఇంజక్షన్లు ఇస్తారు.
గుర్తింపు కోసం చెవి కత్తిరింపు..
ఆపరేషన్ చేసిన కుక్కలను గుర్తించేందుకు వాటికి ఒక చెవి వద్ద ‘వి’ షేపులో కత్తిరిస్తారు. అలాగే ఎక్కడ కుక్కలను పట్టుకున్నారో.. ఆపరేషన్ చేసిన తరువాత అక్కడే వదిలేస్తారు. కొత్త ప్లేస్లో వదిలితే అక్కడి కుక్కలు వాటిపై దాడి చేసే ప్రమాదముంటుందని ఇలా చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన కుక్కలతో ఎలాంటి ఇబ్బంది ఉండదని వెటర్నరీ డాక్టర్ మల్లేశ్ చెబుతున్నారు. ఆపరేషన్ చేశాక ప్రజల మీదికి దాడి చేసే ఉద్రేకం వాటికి ఉండదని తెలిపారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు సైతం బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలో కుక్కలు ఎక్కువే..
కుక్కల సెన్సెస్ రెగ్యులర్గా చేయడంలేదు. 2005లో చేసిన సెన్సెస్ను బేరీజు వేసుకుని తాజాగా వాటి సంఖ్యను అధికారులు లెక్కిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 39 వేలు, నాగర్కర్నూల్ జిల్లాలో 34 వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 27,540, నారాయణపేట జిల్లాలో 17,300,మహబూబ్నగర్ జిల్లాలో 46,204 కుక్కలు ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం కుక్కల జనన నియంత్రణపై దృష్టి పెట్టడంతో పాటు వాటికి వ్యాక్సిన్లు వేస్తుండడంతో ప్రజలు కొంత ఊరట చెందుతున్నారు.