అసెంబ్లీలో వీడియో తీసి మార్ఫింగ్​ చేస్తే కఠిన చర్యలు

అసెంబ్లీలో వీడియో తీసి మార్ఫింగ్​ చేస్తే కఠిన చర్యలు
  •     మంత్రి సీతక్కపై పోస్ట్​ చేసిన వీడియో చాలా దుర్మార్గం
  •     ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు
  •     స్పీకర్​ ప్రసాద్​ హెచ్చరిక

హైదరాబాద్​, వెలుగు : అసెంబ్లీ ప్రాంగణంలో, అసెంబ్లీ హాల్​లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని.. వాటిని మార్ఫింగ్​ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ అన్నారు. అసెంబ్లీ ప్రతిష్టకు భంగం కలిగించే ఈ చర్యలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీతక్కపై మార్ఫింగ్​ వీడియో సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, ఇలాంటి దుర్మా ర్గపు చర్యలను సహించేది లేదన్నారు. 

ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​కు ఆయన చురకలంటించారు.  వీడియో మార్ఫింగ్ అంశం శుక్రవారం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సభలో ఏదో వీడియో తీసుకుని, దాన్ని ఇష్టారాజ్యంగా మార్చి, సోషల్​ మీడియాలో పోస్టు చేస్తున్నారని తెలిపారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి పోస్టులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మార్ఫింగ్​ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

పార్లమెంట్​లో తీస్తున్నారు కదా: కేటీఆర్​

పార్లమెంట్​లో సభ్యులు ఫొటోలు, వీడియోలు తీసుకునే చాన్స్​ ఉందని, అలాంటప్పుడు అసెంబ్లీలో తీస్తే తప్పెలా అవుతుందని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను  దుర్వినియోగం చేస్తున్నదని, ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేస్తున్నదని ఆయన ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు కేసులు పెడుతున్నారని, పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు. 

ఎవరైనా అసెంబ్లీలో ఫొటోలు, వీడియోలు తీసి మార్ఫింగ్‌‌ చేస్తే చర్యలు తీసుకోవాలని.. అదే సమయంలో అధికారపక్షం మరింత బాధ్యతతో వ్యవహరించాలని కేటీఆర్​ అన్నారు.  

స్పీకర్​చర్యలు తీస్కోవచ్చు: ఉత్తమ్​ 

కేటీఆర్​ కామెంట్లపై మంత్రి ఉత్తమ్​ స్పందిస్తూ.. పార్లమెంట్ లోనూ, అసెంబ్లీలోనూ సభ్యులు ఫొటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని.. అలాంటి ఘటనలకు పాల్పడితే స్పీకర్‌‌కు చర్యలు తీసుకునే అధికారం ఉందని స్పష్టంచేశారు. గతంలో రాజ్యసభలో వీడియోలు తీసినట్లు సభ్యురాలు రజనీ పాటిల్​పై ఆరోపణలు వచ్చినందుకే  సెషన్​ మొత్తం సస్పెండ్​ చేశారని గుర్తుచేశారు.

 ‘‘మంత్రి సీతక్క మీద తప్పుడు ట్రోలింగ్ చేస్తే చర్యలు తీసుకోవద్దా... ప్రతిపక్ష సభ్యులు చర్యలు తీసుకోవద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు” అని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు.  

ఆ వీడియో చూసి మాట్లాడండి: కేటీఆర్​కు స్పీకర్ హితవు

రెండు రోజుల క్రితం అసెంబ్లీ హాల్‌‌లో తీసి మార్ఫింగ్​ చేసిన వీడియోను పంపిస్తానని, దాన్ని చూసి మాట్లాడాలని కేటీఆర్​కు స్పీకర్​ గడ్డం ప్రసాద్​ హితవు పలికారు. అలా వీడియోను తీసి, మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ‘‘సభకు సంబంధించిన అంశాలను ఇలా మార్ఫింగ్ చేయడాన్ని సమర్థించలేం. మంత్రి సీతక్కపై తీసిన ఆ వీడియో సభ్య సమాజం తలదించు కునేలా ఉంది. 

మీరు ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడండి” అని కేటీఆర్​కు ఆయన చురకలు అంటించారు. ఈ వీడియోపై విచారణ జరిపిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.