తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు

తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు
  • మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిని కొట్టిన ఎమ్మెల్యే సామెల్ వర్గం
  • గాయపడిన యూత్ కాంగ్రెస్ నూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్​ 

మోత్కూరు, వెలుగు: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు నడుస్తోంది. బీఆర్ఎస్ లీడర్లకు ప్రయారిటీ ఇస్తున్నట్టు ఎమ్మెల్యే మందుల సామెల్ తీరు నచ్చక ఆయనతో విభేదించిన కొందరు కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేశారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి అనుచరులకు పోటీగా ఎమ్మెల్యే సామెల్ కూడా తన అనుచరులను పోటీకి దింపగా ఓడిపోయారు. 

కాగా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇటీవల మోత్కూరులో అసమ్మతి నేతల మీటింగ్ కు మల్లేశ్​ హాజరయ్యారు. ఆ లీడర్ల ప్రెస్ నోట్లు కూడా అతను మీడియాకు పెట్టడంతో పాటు సోషల్ మీడియాలోనూ షేర్ చేశాడు. అంతేకాకుండా మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి ఆర్డీఆర్ అనుచరుడైన యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేశ్ కు ఎమ్మెల్యే సామెల్ సొంత మండలమైన యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో మొబైల్ షాపు ఉంది. మంగళవారం రాత్రి మల్లేశ్ షాపు మూసి వేసి ఇంటికి వెళ్తుండగా ఎమ్మెల్యే అనుచరులు నలుగురు  అడ్డగించారు. 

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎలా పని చేస్తావంటూ మల్లేశ్ పై దాడికి పాల్పడ్డారు. స్థానికులు రావడంతో పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్​ను కుటుంబ సభ్యులు, నేతలు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, స్పృహలో లేడని పార్టీ నేతలు తెలిపారు. 

దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ముఖ్య అనుచరులని, కాగా.. సామెల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీలో చేర్చుకున్నాడని చెప్పారు. అందులో ఒక లీడర్.. సామెల్  గిడ్డంగుల చైర్మన్ గా ఉన్నప్పుడే ఆయన కారుపై చెప్పులేశాడని, అయినా.. అతనికి మోత్కూరు మార్కెట్ డైరెక్టర్ పదవి కూడా ఇచ్చాడని మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు అడ్డగూడూరు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కాంగ్రెస్ లో వర్గపోరు హాట్ టాపిక్ గా మారింది.