హెచ్​సీయూలో అదే టెన్షన్ .. విద్యార్థుల ర్యాలీ అడ్డుకున్న పోలీసులు

హెచ్​సీయూలో అదే టెన్షన్ .. విద్యార్థుల ర్యాలీ అడ్డుకున్న పోలీసులు
  • బారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులు
  • పరిస్థితి అదుపుతప్పడంతో  పోలీసుల లాఠీచార్జ్

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని హైదరాబాద్​సెంట్రల్​ యూనివర్సిటీలో స్టూడెంట్ల ఆందోళన కొనసాగింది. యూనిర్సిటీని ఆనుకొని ఉన్న 400 ఎకరాల  భూమిని ప్రభుత్వం తీసుకోవద్దంటూ  వర్సిటీ స్టూడెంట్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం క్లాసులను బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. వారికి వర్సిటీ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్​ టీచింగ్​స్టాఫ్ మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు చేతులో పట్టుకొని ‘‘భూమిని అమ్మొద్దు.. వర్సిటీ పేరుపై రిజస్ట్రేషన్​​ చేయాలి’’ అంటూ నినదించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్స్​ ఇస్తూ.. అంబేద్కర్​ఆడిటోరియం నుంచి ఈస్ట్​ క్యాంపస్​ వైపు ర్యాలీగా వెళ్లారు. అప్పటికే ఈస్ట్​ క్యాంపస్​ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.  

విద్యార్థి సంఘాల నాయకులు​ బారికేడ్లు నెట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్లడంతో.. పోలీసులు వారిపై లాఠీచార్జ్​ చేశారు. విద్యార్థులను చెదరగొట్టారు.  ఈస్ట్​ క్యాంపస్​ వైపు ఎవ్వరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్​టీచింగ్​ స్టాఫ్​ అందరూ కలిసి ఈస్ట్​ క్యాంపస్​ నుంచి హెచ్ సీయూ అడ్మినిస్ట్రేషన్​​ బిల్డింగ్​ వరకు ర్యాలీగా చేరుకున్నారు. అందరూ కలిసి వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్​​కు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్​ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. స్టూడెంట్లను పోలీసులు వ్యాన్లలో ఎక్కించి సైబారాబాద్​కమిషనరేట్​పరిధిలోని శివారు పోలీస్ స్టేషన్లకు తరలించారు.  

డ్రోన్ ఎగరవేసిన ముగ్గురు అరెస్ట్ 

కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిపై డ్రోన్​ ఎగరవేసిన ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 8:30 గంటలకు బంజారాహిల్స్​ కు చెందిన అడ్వకేట్ రోహన్ నాగిరెడ్డి, జూబ్లీహిల్స్ కు చెందిన సివిల్ ఇంజినీర్ సాయి విజయ రెడ్డి.. రాత్రి 11:30 గంటలకు మణికొండ కు చెందిన ఓ ఐటీ కంపెనీలో అనలిస్టుగా పనిచేసే అరుణ్ నాయర్  డ్రోన్​ ఎగరువేశారని  టీజీఐఐసీ అధికారులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.