- ధర్నాకు దిగిన తల్లిదండ్రులు
- నల్గొండ జిల్లా నిడమనూరు మోడల్ స్కూల్‌లో ఘటన
- హైదరాబాద్ మదీనగూడలో లెక్చరర్‌పై పోక్సో కేసు
హాలియా, వెలుగు : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ స్టూడెంట్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరులో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... నిడమనూరు మండల కేంద్రంలోని ఆదర్శ స్కూల్‌లో ఆంజనేయులు సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో స్టూడెంట్లు శనివారం తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు.
ఆగ్రహానికి గురైన వారు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. సమస్యను ఉన్నతాధికారులకు వివరిస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో ఆందోళన విరమించారు. విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి శనివారం సాయంత్రం మోడల్ స్కూల్‌ను సందర్శించారు. స్టూడెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కోరారు.
లెక్చరర్‌పై పోక్సో కేసు
మియాపూర్, వెలుగు : విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మియాపూర్‌లోని మదీనగూడలో జరిగింది. స్టూడెంట్ల తల్లిదండ్రులు, మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదీనగూడలోని శ్రీచైతన్య శాంకరీ భవన్ క్యాంపస్‌లో హరీశ్ కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, తాను చెప్పినట్లు చేయకపోతే యాసిడ్ పోస్తానని, ప్రాక్టికల్స్‌లో మార్కులు తక్కువ వేస్తానని బెదిరిస్తున్నాడు.
అంతటితో ఆగకుండా స్టూడెంట్లకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపిస్తున్నాడు. లెక్చరర్ వేధింపులు భరించలేక స్టూడెంట్లు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో శనివారం వారు క్యాంపస్ వద్దకు చేరుకొని లెక్చరర్ హరీశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల లీడర్లు కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. మియాపూర్ ఎస్సై కోన వెంకట్ కాలేజీ వద్దకు వచ్చి స్టూడెంట్ల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. లెక్చరర్ హరీశ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.