- 21 ఏండ్లకే యువతకు ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్ ఉండాలి: రేవంత్
- రాజకీయాలను యువత వృత్తిగా ఎంచుకోవాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 21 ఏండ్లు నిండినోళ్లకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంటే.. యూత్ రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉంటుందని చెప్పారు. నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-–18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో 21 ఏండ్లకు ఓటు హక్కు ఉంటే.. దాన్ని 18 ఏండ్లకు తగ్గించిన ఘనత నాటి ప్రధాని రాజీవ్ గాంధీదే.
కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏండ్ల వయసు ఉండాలనే నిబంధనను మాత్రం సవరించలేదు. దీన్ని సవరించుకుని .. 21 ఏండ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. దీంతో యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది. 21 ఏండ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు... 21 ఏండ్లు నిండిన వారు ఎమ్మెల్యేలుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా.
మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొన్న కొందరైనా అసెంబ్లీకి రావాలని, రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. మాక్ అసెంబ్లీ కార్యక్రమాలు, ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమన్నారు. అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన విద్యార్థులకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.