సర్కారు బడి పిల్లల్లో రక్తహీనత

సర్కారు బడి పిల్లల్లో  రక్తహీనత
  • ప్రతి వంద మందిలో 55 మందికి ఐరన్​ లోపం
  • ఆడ పిల్లల్లో మరీ ఎక్కువ 
  • ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు టెస్ట్​లు

యాదాద్రి, వెలుగు : సర్కారు బడుల్లో విద్యార్థులకు రక్తంలో హిమోగ్లోబిన్​శాతం తక్కువగా ఉంటోంది. ప్రతి వంద మందిలో 55 మంది ఐరన్​లోపంతో  బాధపడుతున్నారు. వీరిలో గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వారు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. యాదాద్రి జిల్లాలో 715 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. 

ఇందులో చదువుతున్న స్టూడెంట్స్​కు డీఎంహెచ్​వో మనోహర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ రక్తహీనత టెస్ట్​లు నిర్వహిస్తోంది. రెండు విడతల్లో 37,036 మందికి టెస్ట్​చేయాలని టార్గెట్​పెట్టుకున్నారు. గతేడాది జూలై నుంచి రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్​బీఎస్​కే)లో భాగంగా 8 టీమ్స్​లో మెంబర్లుగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ వీరికి టెస్ట్​లు చేస్తున్నారు. 

54.5 శాతం మందికి రక్తం తక్కువే..

గవర్నమెంట్ స్కూల్స్​లో 8 నుంచి 10 వరకు చదువుతున్న 24,800 మందికి మొదటి విడతలో టెస్ట్​లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కొందరు స్టూడెంట్స్​స్కూల్స్​కు సరిగా రానందున జూలై నుంచి సెప్టెంబర్​ వరకు 22,147 మందికి టెస్ట్​లు చేశారు. వీరిలో గర్ల్స్​11,839 మంది, బాయ్స్​10,308 మంది ఉన్నారు. అయితే వీరిలో రక్తంలో  హిమోగ్లోబిన్ 12 గ్రాములు 9,251 మందికి మాత్రమే ఉంది. మెల్డ్ స్టేజ్​లో 3,302 మందికి 11 నుంచి 11.9 గ్రాములు ఉండగా, మోడరేట్​లో 8,139 మంది స్టూడెంట్స్​కు 8 నుంచి 10.9 గ్రాముల హిమోగ్లోబిన్​ఉంది. 

ప్రమాదకరంగా 8 గ్రాముల్లోపు హిమోగ్లోబిన్ 1,429 మంది స్టూడెంట్స్​కు ఉంది. వీరిలో 1,261 మందిని ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​అందించడంతోపాటు ఐరన్​టాబ్లెట్స్, టానిక్స్​ అందించారు. మొత్తంగా 12,070 (54.5 శాతం) మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరిలో 8,392 (40 శాతం) మంది గర్ల్స్ ఉన్నారు.  

రెండో విడతలో..

రెండో విడతలో 5 నుంచి ఏడో తరగతి చదువుతున్న 18,236 మంది స్టూడెంట్స్​కు టెస్ట్ చేయనున్నారు. గతేడాది నవంబర్ మొదటి వారంలో టెస్ట్​లు ప్రారంభించగా, ఇప్పటివరకు 10,168 మందికి బ్లడ్ టెస్ట్​ చేశారు. వీరిలో 4,098 మందికి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉన్నట్టుగా తేలింది. 

ALSO READ : రాళ్లు, రప్పలకు బంద్​ ఎవుసానికే భరోసా : సీఎం రేవంత్​రెడ్డి 

1,873 మందికి 11 నుంచి 11.9 గ్రాముల చొప్పున ఉండగా, 3,451 మందికి 8 నుంచి 10.9 గ్రాములే ఉంది. ప్రమాదకరంగా 8 గ్రాముల్లోపు 242 మందికి ఉంది. మొత్తంగా 5,570 (55 శాతం) మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.  వీరిలో 3,098 (55 శాతం) మంది గర్ల్స్ ఉన్నారు. ఇటీవల జిల్లాలోని కొంతమంది స్టూడెంట్స్​ను నల్గొండలోని డిస్ట్రిక్​ ఎర్లీ ఇంటర్​వెన్షన్​సెంటర్(డీఈఐసీ)​కు తరలించి ట్రీట్​మెంట్​ఇప్పించారు. 

ఎక్కువ మందికి 9 శాతమే..

రక్తంలో హిమోగ్లోబిన్‌‌12 శాతం ఉండాలి. ఎక్కువ మంది స్టూడెంట్స్​లో 9 కంటే కొంచెం ఎక్కువ శాతం ఉంటోందని పరీక్షల్లో తేలింది. రక్తహీనతతో బాధపడుతున్న వారు తరచూ అలసటకు గురికావడం, బలహీనంగా ఉండడంతోపాటు దమ్ము వస్తుంది. గుండె కూడా వేగంగా కొట్టుకుంటోంది. 

రక్తహీనత ఉన్న వారు కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా ఐరన్ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. బలహీనంగా ఉన్న స్టూడెంట్స్​ తాము నిత్యం తీసుకుంటున్న ఆహారానికి అదనంగా ఆకు కూరలు, పండ్లు, మాంసం, చేపలు తదితర పౌష్టికాహారం తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్‌‌ శాతం పెరుగుతుంది.