- వైజాగ్, పుణె, హైదరాబాద్, వరంగల్ సిటీల్లో రూ.5 కోట్లు వసూలు
హనుమకొండ, వెలుగు : షేర్‌మార్కెట్ లో పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ మోసాలకు పాల్పడుతున్న దంపతులను వరంగల్ టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన నిమిత్ కపాసి అలియాస్ అమిత్ కుమార్ షా కొన్నేండ్ల కింద హైదరాబాద్ వచ్చాడు. ఇస్లామియాబజార్కు చెందిన కాసోజు జయ అలియాస్ సుమన్ కపాసిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఇదివరకే ఆమెకు ఆధార్సెంటర్లో పని చేసిన అనుభవం ఉండడంతో ఇద్దరూ కలిసి ఈజీ మనీ కోసం మోసాలు మొదలుపెట్టారు.
వైజాగ్, పుణె, హైదరాబాద్, వరంగల్ తదితర నగరాల్లో హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, బెంగాలీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ స్థానికులతో మాటలు కలిపేవారు. అవతలి వ్యక్తుల స్వభావాన్ని బట్టి సీబీఐ, ప్రెస్, బ్యాంక్ మేనేజర్ల మంటూ నకిలీ ఐడీ కార్డులు చూపిస్తూ పరిచయం పెంచుకునేవారు. తర్వాత షేర్మార్కెట్లలో పెట్టుబడుల పేరిట, ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. కొన్ని నెలల కింద హనుమకొండలోని సుబేదారి సాయినగర్కాలనీకి మకాం మార్చారు. స్పీకింగ్ సీస్ కన్సల్టెంట్ కంపెనీ పెట్టి ఉద్యోగాలిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.1.30 కోట్ల వరకు వసూలు చేశారు.
జులైవాడకు చెందిన రియాజ్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయినట్టు తెలుసుకున్న రియాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూపీ లాగి గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ సీబీఐ, ప్రెస్, బ్యాంక్మేనేజర్ఐడీ కార్డ్స్‌తో పాటు నకిలీ ఆధార్, పాన్‌కార్డ్స్, రూ.7,800 నగదు, 13 నకిలీ బ్యాంక్చెక్బుక్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇద్దరూ కలిసి వైజాగ్, పుణె, హైదరాబాద్, వరంగల్ లలో రూ.5 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డారని, కేసు విచారణ జరుపుతున్నామని సుబేదారి సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.