
- 622 చ.కి.మీ మేర విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు
- 20 గ్రామాల శివార్లు, స్టేట్, నేషనల్ హైవేలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు
- 90 రోజుల్లో అభ్యంతరాలు, సలహాల స్వీకరణ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీతోపాటు చుట్టూ 62 గ్రామాల పరిధిలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) రూపొందించిన మాస్టర్ ప్లాన్ - 2041 ఎట్టకేలకు సిద్ధమైంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత అమృత్ స్కీమ్ గైడ్ లైన్స్, అర్బన్ డెవలప్ మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్(యూడీపీఎఫ్ఐ) మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్లాన్ ను రూపొందించారు. కరీంనగర్ సిటీ విస్తరణ, భవిష్యత్ అవసరాలు, ఇండస్ట్రీయల్ కారిడార్ల ఏర్పాటు, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్ పై ఏవైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా 90 రోజుల్లోపు సుడా వైస్ చైర్మన్ కు పంపవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
సుడా బౌండరీస్ఫిక్స్
సుడా పరిధిని ప్రస్తుత కరీంనగర్ జిల్లా మొత్తానికి విస్తరిస్తూ నిరుడు అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అంతకంటే ముందే 2019లోనే అప్పటి వరకు ఉనికిలో ఉన్న సుడా పరిధితో మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఈ ప్లాన్ ప్రకారం సుడా పరిధి ఉత్తరం వైపు కిష్టాపూర్ గ్రామ సరిహద్దు వాయవ్య మూల నుంచి మొదలై గ్రామ సరిహద్దుల నుంచి తూర్పు దిక్కున దేశారాజ్ పల్లి, కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట చాకుంట, చామనపల్లి సరిహద్దు వెంబడి తాహరకొండాపూర్ సరిహద్దు ఈశాన్య మూల వరకు ఉంటుంది.
తూర్పున తాహర్ కొండాపూర్ ఈశాన్య మూల నుంచి మొదలై చెర్లభూత్కూర్, ముగ్దుంపూర్, చేగుర్తి, లింగాపూర్, అన్నారం, ఈదులగట్టేపల్లి గ్రామ సరిహద్దుల వెంబడి చెంజర్ల సరిహద్దు వరకు ఉంటుంది. దక్షిణాన చెంజర్ల సరిహద్దు ఆగ్నేయ మూల నుంచి మొదలై పడమర వైపునకు వెళ్తూ మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి (పీఎన్), రేణికుంట, గునుకుల కొండాపూర్, సరిహద్దు నైరుతి మూల వరకు, పడమర దిశ గునుకుల కొండాపూర్ గ్రామ సరిహద్దు నైరుతి మూల నుంచి మొదలై ఉత్తరం దిక్కు వెళ్తూ జంగపల్లి, మాదాపూర్, కాశీంపేట్, పారువెల్ల, కాజీపూర్, ఓద్యారం, నాగుల మాల్యాల, వెలిచాల, వెదిర, కిష్టాపూర్ సరిహద్దు వెంబడి వాయువ్య మూల వరకు సరిహద్దులుగా నిర్ధారించారు.
సిటీ చుట్టూ ఔటర్
కరీంనగర్ సిటీతోపాటు చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కోసం రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు మాస్టర్ ప్లాన్ లో ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 2041 వరకు భవిష్యత్ అవసరాల మేరకు 200 ఫీట్ల వెడల్పుతో 138 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కరీంనగర్–హైదరాబాద్ రాజీవ్ రహదారిని లింక్ చేస్తూ మొదలయ్యే ఓఆర్ఆర్ లోని ఒక భాగం గునుకుల కొండాపూర్, జంగపల్లె, మాదాపూర్, ఖాసింపేట, పారువెల్ల, ఒద్యారం, నాగుల మల్యాల్, కొక్కెరకుంట, వెలిచాల శివారు మీదుగా కరీంనగర్– జగిత్యాల హైవేను కనెక్ట్ చేస్తుంది.
మళ్లీ కొత్తపల్లికి కొంతదూరంలో కరీంనగర్– జగిత్యాల హైవేతో కనెక్టవుతూ కొక్కొరకుంట, జూబ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్శేడు, బొమ్మకల్ శివారులో మానేరు మీదుగా మానకొండూరు, పోరండ్ల, ముంజంపల్లె, నుస్తులాపూర్ శివారు ప్రాంతాలను కలుపుతూ రాజీవ్ రహదారితో కనెక్ట్ అయి ముగుస్తుంది. కరీంనగర్ సిటీ వెంట ఎల్ ఎండీతోపాటు చుట్టూ నేషనల్, స్టేట్ హైవేలు ఉన్న కారణంగా రింగ్ రోడ్డు ఒక చోట ముగిసి మరో చోట స్టార్ట్ అవుతోంది. సుమారు 20 గ్రామాల శివార్ల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది.
2,289 హెక్టార్లలో ఇండస్ట్రియల్ జోన్స్
కరీంనగర్ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కోసం స్పెషల్ ఇండస్ట్రీయల్ జోన్లను ప్రతిపాదించారు. 2,289 హెక్టార్లలో(సుడా మొత్తం విస్తీర్ణంలో4.63 శాతం) ఇండస్ట్రీయల్ జోన్ గా నిర్ధారించారు. ఈ జోన్ పరిధిలోకి ఆసిఫ్ నగర్ , ఒద్యారం, నాగులమల్యాల్(కొంత భాగం), చెంజర్ల(కొంత భాగం), ఎలగందల్(కొంత భాగం), బద్దిపల్లి(కొంత భాగం) రానున్నాయి. అలాగే సిటీలోని మెయిన్ రోడ్ల వెంబడి ఉన్న బిల్డింగ్స్ అన్ని కమర్షియల్ అవసరాలకే వినియోగిస్తున్నప్పటికీ అవి రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉన్నాయి.
అందుకే సిటీలోని మెయిన్ రోడ్లను కమర్షియల్, మిక్స్ డ్ జోన్లుగా ప్రతిపాదించారు. సిటీ డెవలప్ మెంట్ కోసం 40 ఫీట్లు, 50 ఫీట్లు, 60 ఫీట్లు, 100 ఫీట్లు, 150 ఫీట్లు, 200 ఫీట్ల వెడల్పుగల మెయిన్ రోడ్ల వెంట ఈ జోన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇది సిటీలో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించి, నగర అభివృద్ధికి సహకరించనుంది.
భవిష్యత్ రద్దీ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్
కరీంనగర్ కు మాస్టర్ ప్లాన్ దాదాపు 30 ఏళ్ల నాటిదే ఇప్పటివరకు అమలవుతోంది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఎంతో విస్తరించాయి. కొత్త మాస్టర్ ప్లాన్ త్వరలో అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పాత సుడా పరిధిలో ఒక ప్రణాళిక బద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, సెమీ కమర్షియల్, సెమీ రెసిన్షియల్ గా గుర్తించి వాటిని మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచాం. భవిష్యత్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణను ప్రతిపాదించాం.
కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్