ఇళ్లు ఆమ్మేసిన సుందర్ పిచాయ్....తండ్రి భావోద్వేగం..

ఇళ్లు ఆమ్మేసిన సుందర్ పిచాయ్....తండ్రి భావోద్వేగం..

గూగుల్ సీఈఓ  సుందర్ పిచాయ్ తన ఇంటిని అమ్ముకున్నాడు. చెన్నైలోని సుందర్ పిచాయ్ ఇంటిని తమిళ సినీ నటుడు, నిర్మాత సి మణికందన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

పుట్టి పెరిగిన ఇళ్లు ఇదే..

తమిళనాడు చెన్నైలోని అశోక్ నగర్‌లో సుందర్ పిచాయ్ కు ఇళ్లు ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఇంటిలో ఎవరూ నివసించడం లేదు. దీన్ని అమ్మాలని సుందర్ పించాయ్ తల్లిదండ్రులు లక్ష్మి, రేగునాథ పిచాయ్ నిర్ణయించారు. సుందర్ పిచాయ్ పుట్టి పెరిగిన ఈ ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసిన మణికందన్  వెంటనే దాన్ని కొనేందుకు ముందుకు వచ్చారు. సుందర్ తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి.. ఆ ఇంటిని తన సొంతం చేసుకున్నారు.

తండ్రి భావోద్వేగం..

చెన్నైలో సుందర్ పిచాయ్ పుట్టిన పెరిగిన ఇంటి స్థలాన్ని ఆయన తండ్రి రేగునాథ పిచాయ్ అమ్మేశారు. ఈ సమయంలో పిచాయ్ తండ్రి భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారని నిర్మాత మణికందన్  తెలిపారు. సుందర్‌ తండ్రి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉన్నారని....స్థలం  పత్రాలు ఇవ్వడానికి అన్ని పన్నులు చెల్లించారని మణికందన్ చెప్పారు. ఇది తమ మొదటి ఆస్తి కావడంతో స్థలం పత్రాలను అందజేసేటప్పుడు సుందర్ తండ్రి భావోద్వేగంతో కంటతడి పెట్టారని  తెలిపారు.  పాత ఇల్లు కావడంతో దాన్ని కూల్చేందుకు అయ్యే ఖర్చులను కూడా సుందర్ తండ్రే భరించారన్నారు. 

ఇంటిని కొనుగోలు చేయడం గర్వంగా ఉంది..

చెన్నైలో పుట్టి పెరిగిన సుందర్ పిచాయ్ భారత దేశాన్ని  గర్వించేలా ఎదిగారని మణికందన్ కొనియాడారు. అందుకే  ఆయన నివసించిన ఇల్లు స్థలాన్ని కొనాలని నిర్ణయించుకున్నాని చెప్పారు. ఇది  తన జీవితంలో గర్వించదగ్గ విషయమన్నారు. స్థలం  కొనుగోలు జరుగుతున్న సమయంలో సుందర్ పిచాయ్ తల్లిదండ్రుల మర్యాద, ప్రవర్తన తనను ఎంతో కదిలించిందన్నారు. సుందర్ తల్లి అయితే తనకు స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారని చెప్పారు. వారి వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు.

20 ఏండ్ల వరకు ఇక్కడే..

సుందర్ పిచాయ్ చెన్నై ఆశోక్ నగర్లో పుట్టిపెరిగారు. .అతనికి 20 సంవత్సరాల వయస్సు వచ్చే  వరకు ఈ ఇంటిలోనే ఉన్నాడు.  అయితే 1989లో ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. అక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశారు. 2022 డిసెంబర్‌లో సుందర్ పిచాయ్ చెన్నైకి వచ్చినప్పుడు ఈ ఇంటిని సందర్శించారు. సెక్యూరిటీ గార్డులకు ఇంటి ఫర్నీచర్, ఇతర వస్తువులను అందజేశారు. కొంత డబ్బును కూడా ఇచ్చారు. అంతేకాకుండా తన ఇంటి  బాల్కనీలో నిల్చొని ఫోటోలు కూడా తీసుకున్నారు.