ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలి

మంథని, వెలుగు: అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.50 వేల  చొప్పున  నష్ట పరిహారం ఇవ్వాలని బీజేపీ స్టేట్ లీడర్ చందుపట్ల సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మంథని మండలంలోని నాగారం, కన్నాల కొనుగోలు కేంద్రాలను, వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను చందుపట్ల సునీల్ రెడ్డి సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

జగిత్యాల టౌన్, వెలుగు: అకాల వర్షాలతో రైతులు పంటనష్టం వల్ల ఏడుస్తుంటే సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లి ఓట్లు అడుక్కుంటున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి మండిపడ్డారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు నలవాల తిరుపతి ఆధ్వర్యంలో తహసీల్దార్ ‌‌ ‌‌కు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ కన్వీనర్ మదన్మోహన్, పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

కోనరావుపేట,వెలుగు: అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోనరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు.  అనంతరం తహసీల్దార్ ‌‌ ‌‌కు  వినతి పత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు గొట్టే రామచంద్రం, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోల కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు. 

కరీంనగర్​ రూరల్, వెలుగు:  రైతులకు ప్రభుత్వం వెంటనే రూ.50 వేల నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్​ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు డిమాండ్ చేశారు.  కరీంనగర్​ రూరల్ మండలం గోపాల్​పూర్ ఎక్స్​ రోడ్డు రోహిత్​రావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.  రాస్తారోకోలో  కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కామిరెడ్డి రామిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కొత్తపల్లి మండల నాయకులు పంజాల స్వామిగౌడ్, సాయిని శ్రీనివాస్ గ్రామశాఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వెదిర ఎక్స్​రోడ్డు వద్ద వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలంటూ రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్ వద్ద జగిత్యాల, కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులతో కలిసి కాంగ్రెస్​ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ ఇన్​ చార్జి మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఆయన్ని అరెస్టు చేసి రామడుగు పోలీస్ స్టేషన్ కు తరలించారు.