హైదరాబాద్‌‌ వన్‌‌ డర్‌‌‌‌... ఒక్క రన్‌‌ తేడాతో రాజస్తాన్‌‌పై విక్టరీ

హైదరాబాద్‌‌ వన్‌‌ డర్‌‌‌‌...  ఒక్క రన్‌‌ తేడాతో రాజస్తాన్‌‌పై విక్టరీ
  • రైజర్స్‌‌ను గెలిపించిన భువనేశ్వర్‌‌‌‌
  • రాణించిన నితీశ్‌‌, హెడ్‌‌, క్లాసెన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  ఆఖరి బాల్‌‌ వరకు ఉత్కంఠ రేపిన పోరులో సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్ ‘వన్‌‌’డర్‌‌‌‌ఫుల్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసింది.  భువనేశ్వర్ కుమార్ (3/41)  సూపర్ బౌలింగ్‌‌తో చెలరేగిన వేళ టేబుల్‌‌ టాపర్‌‌‌‌ రాజస్తాన్‌‌ జోరుకు బ్రేక్‌‌ వేసింది. వరుసగా రెండు ఓటముల తర్వాత  తిరిగి గెలుపు బాట పట్టింది. ఉప్పల్‌‌ స్టేడియంలో  గురువారం జరిగిన థ్రిల్లింగ్‌‌ మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌  ఒక్క పరుగు తేడాతో రాయల్స్‌‌పై విజయం సాధించింది.  తొలుత  తెలుగు కుర్రాడు నితీశ్‌‌ కుమార్ రెడ్డి (42 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 నాటౌట్‌‌), ట్రావిస్ హెడ్‌‌ (44 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) ఫిఫ్టీలకు తోడు హెన్రిచ్ క్లాసెన్‌‌ (19 బాల్స్‌‌లో  3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 నాటౌట్)  మెరుపులతో సన్‌‌ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201/3 స్కోరు చేసింది.  ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ ఓవర్లన్నీ ఆడి 200/7 స్కోరు చేసి ఓడిపోయింది. రియాన్ పరాగ్‌‌ (49 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77), యశస్వి జైస్వాల్‌‌ (40 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. భువనేశ్వర్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

నితీశ్‌‌ జోరు

టాస్‌‌ నెగ్గిన హైదరాబాద్‌‌ నితీశ్‌‌, హెడ్‌‌కు తోడు చివర్లో క్లాసెన్‌‌ ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్‌‌ తొలి బాల్‌‌కే హెడ్ ఫోర్ కొట్టగా.. రెండో ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (12) సిక్సర్ల ఖాతా తెరిచాడు. కానీ రాయల్స్‌‌ బౌలర్లు ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు.  ఐదో ఓవర్లో  అభిషేక్‌‌ను ఔట్‌‌ చేసిన అవేశ్‌‌ ఖాన్‌‌ రాయల్స్‌‌కు తొలి బ్రేక్ అందించాడు. ఆ వెంటనే అన్మోల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (5)ను సందీప్‌‌ శర్మ వెనక్కుపంపడంతో  పవర్‌‌‌‌ప్లేలో సన్‌‌ రైజర్స్‌‌ 37/2 స్కోరు మాత్రమే చేసింది. పవర్‌‌‌‌ ప్లేలో భారీ షాట్లు ఆడలేకపోయిన హెడ్‌‌.. స్పిన్నర్‌‌‌‌ చహల్‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా 6, 6, 4తో ఇన్నింగ్స్‌‌కు ఊపు తెచ్చాడు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న నితీశ్‌‌.. అశ్విన్‌‌ బౌలింగ్‌‌లో లాంగాన్‌‌ మీదుగా సిక్స్‌‌తో జోరు పెంచాడు.

 సగం ఓవర్లకు సన్‌‌ రైజర్స్‌‌ 75/2 స్కోరుతో నిలిచింది. సెకండాఫ్​లో హోమ్‌‌ టీమ్‌‌ గేర్లు మార్చింది.  అవేశ్‌‌ బౌలింగ్‌‌లో  సిక్స్‌‌ కొట్టిన నితీశ్‌‌ చహల్‌‌ వేసిన 13వ ఓవర్లో 6, 4, 6, 4తో రెచ్చిపోయాడు. 38 బాల్స్‌‌లో ఫిఫ్టీ ..పూర్తి చేసుకున్న హెడ్‌‌... 15వ ఓవర్లో  సిక్స్‌‌తో స్పీడు అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ, వైడ్‌‌ యార్కర్‌‌‌‌తో అతడిని బౌల్డ్‌‌ చేసిన అవేశ్‌‌ మూడో వికెట్‌‌కు  96  రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు.  మరో ఎండ్‌‌లో నితీశ్‌‌ వెనక్కు తగ్గలేదు. 30 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతనికి స్లాగ్‌‌ ఓవర్లలో క్లాసెన్‌‌ తోడవడంతో  స్కోరు బోర్డు దూసుకెళ్లింది. అశ్విన్‌‌ వేసిన 16వ ఓవర్లో నితీశ్‌‌ వరుసగా రెండు సిక్సర్లు కొట్టగా..  చహల్‌‌ బౌలింగ్‌‌లో  క్లాసెన్‌‌ కూడా 6, 6తో  ఆకట్టుకున్నాడు. అవేశ్‌‌ వేసిన 18వ ఓవర్లో నితీశ్‌‌ 4,6 కొట్టగా...  బౌల్ట్‌‌ ఓవర్లో క్లాసెన్‌‌ రెండు ఫోర్లు రాబట్టాడు. సందీప్‌‌ వేసిన ఆఖరి ఓవర్లో  4, 6తో  స్కోరు 200 దాటించిన క్లాసెన్‌‌ ఇన్నింగ్స్‌‌కు సూపర్‌‌‌‌ ఫినిషింగ్‌‌ ఇచ్చాడు. నాలుగో  వికెట్‌‌కు నితీశ్‌‌, క్లాసెన్‌‌ 32 బాల్స్‌‌లోనే అజేయంగా 70 రన్స్ జోడించారు.

జైస్వాల్‌‌, పరాగ్‌‌ దంచినా..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో  రాజస్తాన్‌‌కు తొలి ఓవర్లోనే డబుల్‌‌ షాకిచ్చిన భువనేశ్వర్‌‌‌‌ ఆఖరి ఓవర్లోనూ సూపర్ బౌలింగ్‌‌తో జట్టును గెలిపించాడు. భీకర ఫామ్‌‌లో ఉన్న బట్లర్‌‌‌‌ (0), కెప్టెన్ సంజు శాంసన్‌‌ (0)ను  ఔట్‌‌ చేసిన భువీ రైజర్స్‌‌కు అదిరిపోయే ఆరంభం అందించాడు . కానీ, మరో ఓపెనర్‌‌‌‌ యశస్వి జైస్వాల్, నాలుగో నంబర్‌‌‌‌లో వచ్చిన రియాన్ పరాగ్‌‌ ఆతిథ్య బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.  రెండో ఓవర్లో  జైస్వాల్‌‌ బౌండ్రీల ఖాతా తెరవగా.. భువీ వేసిన మూడో ఓవర్లో  పరాగ్‌‌ 4, 6, 4తో హిట్టింగ్ స్టార్ట్‌‌ చేశాడు. జాన్సెన్‌‌ బౌలింగ్‌‌లో వరుసగా రెండు ఫోర్లు రాబట్టిన జైస్వాల్‌‌..  ఆవెంటనే  కెప్టెన్‌‌ కమిన్స్‌‌కు 4, 4, 6తో వెల్‌‌కం చెప్పాడు. జైస్వాల్‌‌, పరాగ్ జోరుతో  పవర్‌‌‌‌ ప్లేలో 60/2 స్కోరుతో  నిలిచిన రాజస్తాన్‌‌ సగం ఓవర్లకు వంద దాటింది. ఈ క్రమంలో  జైస్వాల్ (30 బాల్స్‌‌లో), పరాగ్ (31 బాల్స్‌‌లో) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. భువీ వేసిన 13వ ఓవర్లో యశస్వి 6, రియాన్‌‌ 4 కొట్టడంతో స్కోరు 130 దాటి రాయల్స్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లో నటరాజన్‌‌ యార్కర్‌‌‌‌ను ల్యాప్ షాట్‌‌కు ట్రై చేసిన యశస్వి బౌల్డ్‌‌ అవ్వడంతో  మూడో  వికెట్‌‌కు 132 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ బ్రేక్  అయింది. షిమ్రన్ హెట్‌‌మయర్‌‌‌‌  (13 )తో కలిసి స్కోరు 150 దాటించిన పరాగ్‌‌.. కమిన్స్‌‌ వేసిన 16వ ఓవర్లో జాన్సెన్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో  రైజర్స్‌‌ రేసులోకి వచ్చింది. 

24 బాల్స్‌‌లో 42 రన్స్ అవసరమైన దశలో రోవ్‌‌మన్‌‌ పావెల్‌‌ (27).. జాన్సెన్‌‌ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు కొట్టగా.. నటరాజన్‌‌ వేసిన 18వ ఓవర్లో హెట్‌‌మయర్‌‌‌‌  భారీ సిక్స్‌‌ రాబట్టాడు. కానీ, అదే ఓవర్లో హెట్‌‌మయర్‌‌‌‌ను నట్టూ ఔట్‌‌ చేయడంతో మ్యాచ్‌‌లో ఉత్కంఠ పెరిగింది. రాయల్స్‌‌ విజయ సమీకరణం 12 బాల్స్‌‌లో 20 రన్స్‌‌గా మారగా 19వ ఓవర్‌‌‌‌ తొలి బాల్‌‌కే ధ్రువ్‌‌ జురెల్‌‌(1)ను పెవిలియన్‌‌ చేర్చిన కమిన్స్‌‌ తర్వాతి నాలుగు బాల్స్‌‌లో ఒకే పరుగు ఇచ్చాడు. కానీ చివరి బాల్‌‌కు పావెల్‌‌ సిక్స్ కొట్టడంతో  ఆఖరి ఓవర్లో రాయల్స్‌‌కు 13 రన్స్‌‌ అవసరం అయ్యాయి.  20వ ఓవర్‌‌‌‌  తొలి బాల్‌‌కు అశ్విన్‌‌ (2 నాటౌట్‌‌) సింగిల్ తీయగా.. తర్వాతి నాలుగు బాల్స్‌‌కు పావెల్‌‌ 2, 4, 2, 2 రాబట్టాడు. ఆఖరి బాల్‌‌కు రెండు రన్స్ అవసరం అయ్యాయి. అయితే, ఫుల్‌‌ టాస్‌‌ బాల్‌‌తో పావెల్‌‌ను ఎల్బీ చేసిన భువీ రైజర్స్‌‌ను గెలిపించాడు.

 సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్‌‌: 20 ఓవర్లలో 201/3 (నితీష్‌‌ 76*, ట్రావిస్‌‌ హెడ్ 58, క్లాసెన్‌‌ 42* , అవేశ్‌‌ ఖాన్‌‌ 2/39) . రాజస్తాన్‌‌: 20 ఓవర్లలో 200/7 (పరాగ్‌‌ 77, జైస్వాల్‌‌ 67, భువనేశ్వర్ 3/41, కమిన్స్‌‌ 2/34).