న్యాయాధికారుల తొలగింపు కేసు.. విచారణ మే 5వ తేదీకి వాయిదా

న్యాయాధికారుల తొలగింపు కేసు.. విచారణ మే 5వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో న్యాయాధికారుల తొలగింపు వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్​పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జిల్లా కోర్టుల్లో గవర్నమెంట్ ప్లీడర్లు, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్లను గత ప్రభుత్వం నియమించింది. ఇందు లో రూల్స్​కు విరుద్ధంగా జరిగిన నియామకాలను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఆర్టీ నం.354ను తీసుకువచ్చింది. తమ నియామకాలను రద్దు చేయడాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. ప్రభుత్వాలు తమకు నచ్చిన న్యాయాధికారులను నియమించుకునే స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంలో కలగజేసుకోవడం పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలకు సంకెళ్లు వేయడమేనని కామెంట్స్ చేసింది. 

ఈ తీర్పును సవాల్ చేస్తూ..పిటిషనర్లు డివిజన్ బెంచ్​కు వెళ్లినా చుక్కెదురైంది. దీంతో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ యాండాల ప్రదీప్ సహా మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది షోబ్ ఆలం, పి.మోహిత్ రావు(ఏఓఆర్), అక్షిత, వెంకట్ సాయి, తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దేవినా సెహగల్(ఏఓఆర్), ఉదయ్ భాను హాజర య్యారు. వాదనలు వినిపించేందుకు కొంత టైం ఇవ్వాలని సెహగల్ కోర్టును అభ్యర్థించారు.