
- మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ’కేసులో సుప్రీంకోర్టు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజుకు కాపీ రైట్ కేసులో గతంలో కల్పించిన మధ్యంతర రక్షణను కొనసాగిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో దిల్ రాజు సహా మిగిలిన వారిపై సెక్షన్ 63 ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా స్టే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ’ని తన నవల ‘నా మనసు నిన్ను కోరే’ఆధారంగా నిర్మించారని 2017లో రచయిత్రి ముమ్మిడి శ్యామల రాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కాపీ రైట్ కేసులో దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ రావుపై కంప్లైట్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితురాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన నవలలోని అనేక సంఘటనలు, సంభాషణలు కాపీ చేశారని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించి చార్జిషీట్ ఫైల్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ దిల్ రాజు సహా మరికొంత మంది 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వాదనలను పరిగణనలోకి తీసుకొన్న కోర్టు.. గతేడాది డిసెంబర్‌లో దిల్ రాజు సహా మరికొందరిపై దాఖలైన చార్జిషీట్‌లో సెక్షన్ 420ని తొలగించాలని ఆదేశించింది. సెక్షన్ 63పై కింది కోర్టులో యథావిధిగా విచారణ జరగాలని స్పష్టం చేసింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టును దిల్ రాజు ఆశ్రయించారు. సెక్షన్ 63 కేసును సైతం క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌ల బెంచ్ మధ్యంతర రక్షణ కల్పించింది. శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ కోర్టు ముందుకు రాగా.. గత మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.