మీకు ఇచ్చేది కొద్ది సమయమే.. లేకపోతే మేం రంగంలోకి దిగుతాం : మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు

మీకు ఇచ్చేది కొద్ది సమయమే.. లేకపోతే మేం రంగంలోకి దిగుతాం : మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు

మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించి ఘటన  దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ..కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ దుర్ఘటన తమను తీవ్రంగా కలిచి వేసిందని  వ్యాఖ్యానించింది. నిందితులపై చట్ట ప్రకారం తీసుకున్న చర్యలను  జులై 28లోగా కోర్టుకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు..  మణిపూర్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. భారత అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తుషార్‌ మెహతా విచారణకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సూచించారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే..తామే తీసుకుంటామని హెచ్చరించింది. 

మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే నెలలో జరిగినా...దాని వల్ల ఎలాంటి తేడా లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై చాలా బాధపడ్డామన్నారు. తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తునట్లు తెలిపారు. ఈ హేయమైన ఘటనపై  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  ఇది ఎంత మాత్రమూ  ఆమోదయోగ్యం కాదన్నారు.  లింగ హింసను ప్రేరేపించడానికి మహిళలను సాధనంగా ఉపయోగించడం తీవ్ర కలత కలిగిస్తోందన్నారు.  ఇది అత్యంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన అని  సీజేఐ  పేర్కొన్నారు. ఇలాంటి దారుణమైన హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తప్పక తెలియజేయాలని ఆదేశించారు.   ప్రభుత్వం చర్య తీసుకోకపోతే..తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. 

మణిపూర్‌లో మైతీలు, గిరిజన ఆదివాసీల మధ్య ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై వివాదం కొనసాగుతోంది. మణిపూర్ హైకోర్టు ఆదేశాలతో  ఆ రాష్ట్ర  ప్రభుత్వం మైతీలకు అనుకూలంగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీంతో గిరిజన ఆదివాసీలు అల్లర్లకు పాల్పడ్డారు. మే నుంచి మణిపూర్ లో హింస కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించారు. అంతేకాకుండా వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన  వీడియో జులై 19వ తేదీ బుధవారం వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడ్ని తౌబుల్ జిల్లాలో అరెస్ట్ చేశారు.  అటు వీడియాను  ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియాల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.